'కేసీఆర్ మాదిరే.. ఈటెల సన్నగానే ఉంటారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని అందించలేదని చెప్పారు. తాను హాస్టల్లో ఉండి చదువుకున్నానని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం భోజనం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తమ్ముడు ఈటెల రాజేందర్ కోరగా.. తాను ఏమాత్రం ఆలోచించకుండా సన్నబియ్యం మంజూరు చేయాలని ఆదేశించినట్లు కేసీఆర్ చెప్పారు.
రాష్ట్ర విభజనకు ముందు ఉడకని అన్నం, దొడ్డు బియ్యం అన్నం తిన్న హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందించామని ఆయన అన్నారు. సన్నబియ్యం పథకానికి ఛాంపియన్ తమ్ముడు ఈటెల రాజేందరే అని ఆయన అన్నారు. అలాగే ప్రపంచం అబ్బురపడేలా రూ.5 కోట్లతో కొమురం భీం విగ్రహ నిర్మాణం జరుగుతోందన్నారు. అలాగే పీపీ నరసింహారావు జాతి గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. యాదగిరి గుట్టను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు.