సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధిష్టానం సంస్థాగత నిర్మాణంపై మరింత దృష్టి సారించింది. సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టిన ఆ పార్టీ నాయకత్వం గ్రామ, మండల కమిటీలు నియామకం పూర్తిచేసేలా ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేస్తోంది. సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈసారి క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. ఈక్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ సేకరణ 6 లక్షలు లక్ష్యం కాగా.. 6.85 లక్షల వరకు చేరుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసిన 10 నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకుర్తిలో 74,650, ములుగు 72,262, మహబూబాబాద్‌లో 70,475, వర్ధన్నపేటలో 64,850 మంది టీఆర్‌ఎస్ సభ్యులుగా చేరారు. మిగతా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం లక్ష్యాల మేరకు సభ్యత్వ సేకరణ ఇటీవలే పూర్తి కాగా.. ఇప్పుడు గ్రామ, మండల కమిటీల పూర్తిపై అధిష్టానం దృష్టి సారించింది. ఈనెల 15లోగా కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కొందరు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తాజా పరిస్థితులపై కేటీఆర్ ఆరా
మంత్రివర్గ విస్తరణ తదనంతరం ఏర్పడిన తాజా పరిస్థితులపై మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇప్పటికే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు పదవులు రాకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు ఉన్నాయన్న సమాచారం మేరకు నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగినట్లు పార్టీవర్గాల సమాచారం. అలాగే, మున్సిపల్ ఎన్నికలు, తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీలు, ఇన్‌చార్జ్‌లతో సమావేశమైన ఆయన తాజా పరిస్థితులపై ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ఈనెల 15 నుంచి మున్సిపల్ ఎన్నికలపై రంగంలోకి దిగనున్నట్లు వెల్లడించిన ఆయన.. అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ మండల, బూత్ కమిటీలతో త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో మున్సిపాలిటీల్లో తాజా పరిస్థితులపై ఇన్‌చార్జ్‌లు అధిష్టానానికి నివేదికలు అందజేశారు. కొన్ని చోట్ల పార్టీ గ్రూపులుగా విడిపోయిందని నేతల నివేదికల్లో పేర్కొన్న క్రమంలో ఇక నుంచి ప్రతీ నెల తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించినట్లు తెలిసింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితులు, ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేయాలని కేటీఆర్ ఇన్‌చార్జిలను ఆదేశించినట్లు సమాచారం.
‘సభ్యత్వం’లో పాల్గొన్న వారికే పెద్దపీట
టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మొదటి దశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని స్థాయిలో టీఆర్‌ఎస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై 27వరకు నెలలోగా పూర్తి చేయాలనుకున్నారు. అయితే దశల వారీగా ఇది ఆగస్టు 10వ తేదీ వరకు కూడా కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష్యానికి మించి సభ్యత్వాలు సేకరించడంతో నాయకులు, ఇన్‌చార్జ్‌లను అధిష్టానం అభినందించింది.
ఇందులో ఎమ్మెల్యేలే కీలకంగా వ్యవహరించగా, త్వరితగతిన కమిటీలు సైతం పూర్తి చేయాలని అధిష్టానం పురమాయించడంతో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా జాబితాలు సిద్ధం చేయిస్తున్నారు. సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించడంతో పాటు పార్టీపై విశ్వాసంతో ఉన్న వారికి గ్రామ, మండల తదితర కమిటీల్లో అవకాశం కల్పించాలని చూస్తున్నారు. కాగా రెండు, మూడు నియోజకవర్గాల్లో కమిటీల నియామకం చివరి దశకు చేరుకోగా.. గ్రూపులు, వివాదాలు ఉన్న చోట నత్తనడకన సాగుతున్నాయి.
త్వరలోనే నామినేటేడ్ పోస్టులు కూడా...
మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ఎన్నికల్లో అవకాశం రాని సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. పార్టీ కమిటీల నియామకం పూర్తయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటేడ్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులపై గురి పెట్టారు. ఇప్పటికే వికలాంగుల సహకార, రైతు విమోచన కమిషన్, గొర్రెలు, మేకల అభివృద్ధి, మహిళా ఆర్థిక సహకార తదితర కార్పొరేషన్ల నియామకంలో జిల్లా సీనియర్లకు పార్టీ అధిష్టానం నామినేటేడ్ పోస్టుల్లో పెద్ద పీట వేసింది. ఈసారి కూడా మరికొందరు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న సమాచారం మేరకు ఆశావహులు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో పాటు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment