గులాబీ జెండా? | TRS party flag? | Sakshi
Sakshi News home page

గులాబీ జెండా?

Published Sat, May 31 2014 3:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

TRS party flag?

 గోదావరిఖని, న్యూస్‌లైన్: రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొమ్మిది మంది స్వతంత్ర సభ్యులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల సహకారంతో టీఆర్‌ఎస్ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన మెజారిటీ ఇండిపెండెంట్ సభ్యులను టీఆర్‌ఎస్ చాకచక్యంతా తనవైపు తిప్పుకుంది. చివరకు వారందరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని 12వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తు తం 14 మంది టీఆర్‌ఎస్, ఇద్దరు బీజేపీ, తొమ్మి ది మంది స్వతంత్ర కార్పొరేటర్లతో టీఆర్‌ఎస్ క్యాంపు యానాంలో కొనసాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరై క్యాంపులో ఉన్న కార్పొరేటర్లతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ యన ఫోన్‌లో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. స్వతంత్ర కార్పొరేటర్లను ముందుగా టీఆర్‌ఎస్‌లో చేర్పించి, ఆ తర్వాత టీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో కొంకటి లక్ష్మీనారాయణను మేయర్ గా ఎన్నుకోవాలని నిర్ణయించామని తెలి పా రు. రామగుండం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లకు టీఆర్‌ఎస్ 14, బీజేపీ రెండు స్థానాలను గెల్చుకోగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రె స్ పార్టీ తరఫున 19 మంది విజయం సాధిం చారు. స్వతంత్రంగా గెలిచిన వారిలో నుంచి తొమ్మిది మంది కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ క్యాంపులో చేరిపోయారు. వారందరు 12వ డివిజన్ నుంచి గెలుపొందిన కొంకటి లక్ష్మీనారాయణను మేయర్‌గా చేయాలని ఈ సమావేశంలో పట్టుబట్టారు. ఇందుకు టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ సభ్యులు అంగీకరించారు.
 
 శిబి రంలో మొత్తం 25 మంది కార్పొరేటర్లు ఉండ గా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మె ల్యే ఓట్లతో టీఆర్‌ఎస్ సంఖ్యాబలం 27కు చేరనుంది. దీంతో రామగుండం మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకోవడం ఖాయమైంది. ఇక డెప్యూటీ మేయర్ పదవిని టీఆర్‌ఎస్‌కు వదిలివేయగా... అభ్యర్థి ఎంపికను తమ సభ్యుల నిర్ణయానికే వదిలేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో సాగుతున్న తర్జనభర్జనలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లతో పాటు తొమ్మిదిమంది స్వతంత్ర కార్పొరేటర్ల ఖర్చులను మేయర్ అభ్యర్థి లక్ష్మీనారాయణ భరించుకోవాలని, డెప్యూటీ మేయర్ పదవిని ఆశించేవారు మిగతా 13 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ఖర్చును మోయాలని నిర్ణయించారు.
 
 4న క్యాంపునకు కాంగ్రెస్ కార్పొరేటర్లు : రామగుండం మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జూన్  4వ తేదీ నుంచి తమ కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ ఒకటవ తేదీన గోదావరిఖనిలో జరిగే సమావేశానికి హాజరై క్యాంపు విషయం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకు తోడు ఆరుగురు స్వతంత్ర కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ ఇప్పటికే ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. వీరి సంఖ్య కూడా 25కు చేరగా, టీఆర్‌ఎస్ క్యాంపులోంచి ఎవరైనా రాకపోతారా.. అనే ఆశతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement