టీఆర్‌ఎస్ సభ సక్సెస్
హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్
విజయగర్జన సభ విజయవంతం
పది జిల్లాల నుంచి భారీగా
తరలివచ్చిన జనం
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ర్ట సమితి 14వ ఆవిర్భావ సభ విజయవంతమైంది. అంచనాలకు తగినట్లే జనసమీకరణ జరగడంతో పార్టీ నాయకత్వం ఆనందంలో మునిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికార పార్టీ హోదాలో జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో... టీఆర్‌ఎస్ నాయకత్వం సభను విజయవంతం చేయడం కోసం అన్ని చర్యలూ చేపట్టింది. ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్న భరోసా ఇవ్వడం, విపక్షాల నోళ్లు మూయించడం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనేలా చేయడం, గడిచిన పది నెలల పాలనపై ప్రజలకు వివరించడం, భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించడం వంటి బహుళ లక్ష్యాలతో టీఆర్‌ఎస్ ఈ ఆవిర్భావ సభను నిర్వహించింది.
మధ్యాహ్నం నుంచే: సభ మధ్యాహ్నం 3 గంటలకే మొదలవుతుందని, 5 గంటలకల్లా కేసీఆర్ ప్రసంగం మొదలవుతుందని పార్టీ నాయకులు ప్రచారం చేయడంతో.. జిల్లాల నుంచి మధ్యాహ్నానికే సభాస్థలికి జనం చేరిక మొదలైంది. హైదరాబాద్‌లోకి చేరుకునే ప్రధాన మార్గాల్లోనే వాహనాలకు పార్కిం గ్ ఇవ్వడంతో వచ్చినవారంతా కిలోమీటర్ల కొద్దీ నడిచి పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
ఒకే ఒక్కడు..
ప్లీనరీలో మాట్లాడిన వక్తలే ఈ బహిరంగ సభలోనూ ప్రసంగించారు. ఒకవిధంగా సోమవారం సభలో కే సీఆర్ ఒక్కరే ప్రసంగించారని చెప్పొచ్చు. పార్టీ సీనియర్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేకే, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొద్ది నిమిషాలసేపు మాట్లాడారు. సభా వేదికపై పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నా.. ఎవరికీ ప్రసంగించే అవకాశం రాలేదు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని...ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టని పలు హామీలపై సీఎం కేసీఆర్ మరోసారి హామీ ఇచ్చారు. రెండు గదుల ఇళ్లు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల భర్తీ, కేజీ టు పీజీ వంటి వాటిపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు.
ప్రధానంగా పథకాలపైనే..
ముఖ్యమంత్రి కేసీఆర్ సహజ శైలికి భిన్నంగా సభలో 34 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. అందులోనూ పూర్తిగా ప్రభుత్వ పథకాల గురించి, పది నెలల పాలన విజయాలను వివరించడానికే ప్రాధాన్యమిచ్చారు. గతంలోలా ఆయన ప్రసంగంలో మెరుపులు, విరుపులు కనిపించలేదు. మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన విమర్శలు మినహా.. ఇతర పార్టీలు, వాటి నేతలపై పెద్దగా విమర్శలు చేయలేదు. సాధారణంగానే విద్యుత్ కోతల్లేకుండా చేసినదీ వివరించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు జీవన భృతి, పెన్షన్లు, రైతు రుణమాఫీ, హాస్టళ్లకు సన్నబియ్యం వంటి అంశాలపై మాట్లాడారు. సాయంత్రం 6.44 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న ఆయన.. దాదాపు 7.10 నిమిషాల సమయంలో ప్రసంగం మొదలుపెట్టి, 7.44 గంటల కల్లా ముగించారు. ఆదిలాబాద్, ఖమ్మం వంటి సుదూర ప్రాంతాల నుంచి సభకు వచ్చినవారికి ఇబ్బంది ఉండొద్దనే ముందుగా సభను ముగించామని పార్టీ నేత ఒకరు చెప్పారు.