కేసీఆర్‌ కంటే ముందే మంత్రిగా పనిచేశా.. | ‘TRS party not complete the projects ’ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కంటే ముందే మంత్రిగా పనిచేశా..

Published Tue, Apr 18 2017 9:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కేసీఆర్‌ కంటే ముందే మంత్రిగా పనిచేశా.. - Sakshi

కేసీఆర్‌ కంటే ముందే మంత్రిగా పనిచేశా..

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కంటే ముందుగానే మంత్రి పదవి చేసిన తనపై ఆయన పిల్లలైన మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కవితలు అహంకారపూరితంగా, అధికారగర్వంతో మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి పెట్టిన జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘అధికారగర్వంతో, అహంకార పూరితంగా కేటీఆర్‌, కవిత మాట్లాడుతున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను పాతరపెడ్తారా?

మిగులుబడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన టీఆర్‌ఎస్‌ విధానాలను విమర్శిస్తే కాంగ్రెస్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడ్తారా? కేవలం మూడేళ్ల పసిగుడ్డు పాలనతో రాష్ట్ర బడ్జెట్‌ లక్షన్నరకోట్లకు వచ్చిందా? కాంగ్రెస్‌ అభివృద్ధి ఏమీ చేయలేదా? టీఆర్‌ఎస్‌ ఇంకా ఉద్యమంలోనే ఉందా, ప్రభుత్వంలో ఉందా అనేది మాట్లాడటానికి ముందు ఆలోచించుకోవాలి’ అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ‘నాకు మంత్రి పదవికోసమే కరీంనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసినట్టుగా కేటీఆర్‌, కవిత మాట్లాడటం వారి అవివేకం. నా రాజకీయ చరిత్ర ఏమిటో వాళ్ల నాయిన కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. కేసీఆర్‌ కంటే ముందుగానే ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాను.

1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చంద్రబాబునాయుడు మంత్రి పదవిని ఇస్తే టీఆర్‌ఎస్‌ పుట్టేదా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో చంద్రబాబునాయుడుకు కేసీఆర్‌ తాబేదారుగా పనిచేశాడు. చంద్రబాబు మోచేతి నీళ్లుతాగుతూ, మంత్రి పదవిని అనుభవించినంతకాలం గుర్తుకురాని తెలంగాణ మంత్రిపదవి రాకపోయేసరికి కేసీఆర్‌కు గుర్తుకొచ్చింది. టీఆర్‌ఎస్‌ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్‌ కండువా వేసుకుని కరీంనగర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలవలేదా? అధికారపార్టీలో ఉంటూనే తెలంగాణకోసం పోరాడి, జైలుకు పోయిన చరిత్రనాది.

తెలంగాణకోసం ఏనాడైనా, ఒక్కరోజైనా కేటీఆర్‌, కవిత జైలుకు పోయారా? వాస్తవాలను దాచిపెట్టాలనుకుంటే చరిత్ర మారదు’ అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పంలేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా ప్రాజెక్టులను పూర్తిచేస్తారని ప్రశ్నించారు. శాసనసభలో తాను మాట్లాడని మాటలను ప్రస్తావించిన కేటీఆర్‌పై ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తానని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు నిద్రపోయి, సింగరేణిలో ఎన్నికలు రాగానే, హడావిడిగా వారసత్వ ఉద్యోగాల కల్పన పేరుతో డ్రామాలకు టీఆర్‌ఎస్‌ తెరలేపిందని విమర్శించారు.

కోర్టుతో ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న ప్రభుత్వం ఏదీ లేదని, అధికారంలో కొనసాగే అర్హత కూడా టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఒకటి, రెండు తప్ప ఏవీ అమలుచేయలేదన్నారు. కాంగ్రెస్‌లోకి హరీష్‌రావు వెళ్లడు అని స్వయంగా మంత్రి కేటీఆర్‌ అన్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని, బయటకు కనిపించిన రాజకీయ పరిణామాలేవో, అంతర్గతంగా జరుగుతుండొచ్చునని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, కాంగ్రెస్‌ అంటూ కేటీఆర్‌కు అనుమానం ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌పార్టీయే బాహుబలి అని, కాంగ్రెస్‌లో నాయకులు లేరని హరీష్‌రావును పిలుస్తామా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల అహంకార  ధోరణి చూస్తుంటే వాళ్లకు ఘడియలు దగ్గరపడుతున్నట్టున్నాయని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అంబెడ్కర్ జయంతి నాడు నివాళులు అర్పించడానికి రాని  దౌర్భాగ్యుడు సీఎం కేసీఆర్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. లైసెన్సు లేకుండా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన కుర్చీని కాపాడుకోవడానికి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement