
టీఆర్‌ఎస్ పాలన బ్రిటీష్ రాజ్యాన్ని తలపిస్తోంది: చింతల
బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతామని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్...బ్రిటిషర్లు, నిజాములను తలపించే విధంగా పాలన కొనసాగిస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ) విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అన్యాయంగా ఇతర పార్టీల నాయకులు, ప్రజలను వేధిస్తున్నారని, అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నించిన వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి ప్రశ్నించినందుకు స్థానిక బీజేపీ నేత రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బాన్సువాడ సీఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి తాను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు.