
దుండగుని మాటలు నమ్మి మోసపోయి...
నగరానికి చేరుకున్న బంగ్లాదేశ్ బాలికలు
సికింద్రాబాద్: పని ఇప్పిస్తానని నమ్మబలికి ముగ్గురు బాలికలను బంగ్లాదేశ్ నుంచి నగరానికి తీసుకొచ్చి ఉడాయించాడో మోసగాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న ఆ ముగ్గురు బాలికలను మంగళవారం దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. వివరాలు.. బంగ్లాదేశ్‌కు చెందిన ఆశియా అక్తర్ (11), రోహిమా (15), ముర్షీదాబేగం (13)లకు గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, బాగా డబ్బు సంపాదించుకొని తల్లిదండ్రుల వద్దకు తిరిగి రావచ్చని నమ్మబలికాడు. దీంతో వారు అతడితో కలిసి రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు ప్రయాణంలోనే అతడి మాటలు, ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన బాలికలు తమకు నిజంగానే ఉద్యోగాలు ఇప్పిస్తావా? లేదా అంటూ అతడిని నిలదీశారు. దీంతో అతను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి కనిపించకుండాపోయాడు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాలికలు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని దివ్యదిశ స్వచ్ఛంద సంస్థకు చెందిన చైల్డ్ హెల్ప్‌డెస్క్ ప్రతినిధులు గమనించి వివరాలు తెలుకున్నారు. బాధిత బాలికలతో తమను నగరానికి తీసుకొచ్చి పారిపోయిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అనంతరం నింబోలిఅడ్డాలోని బాలికల వసతిగృహంలో బాలికలకు ఆశ్రయం కల్పించారు. బాలికల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.