సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సర్వేకు తెరలేచింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమగ్ర వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల నుంచి తెప్పించుకుంటోంది. బీసీల స్థితిగతులపై వివిధ కోణాల్లో పరిశీలనకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కులాలు, ఉప కులాల ప్రాతిని«ధ్యంపై తులనాత్మక విశ్లేషణకు వీలుగా ఏడు రకాల ఫార్మాట్‌లో ఉద్యోగుల సమాచారం సేకరిస్తోంది.
నిర్దేశించిన నమూనాల్లో ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని అక్టోబర్ 15లోగా పంపాలని ప్రభుత్వ శాఖలన్నింటినీ కోరింది. సర్వే వివరాలు అందిన తర్వాత 2011 జనాభా లెక్కలతో పోల్చి ప్రభుత్వ కొలువుల్లో బీసీల్లోని 112 ఉప కులాల ప్రాతినిధ్యంపై విశ్లేషణలు చేయనుంది. రాష్ట్రంలోని బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభుత్వానికి అందజేసే అధ్యయన నివేదికలో సైతం ఈ సమాచారాన్ని పొందుపరచనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని బీసీ ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆయా కులాల రిజర్వేషన్లను పెంచాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.
అలాగే ఉప కులాల స్థితిగతుల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణలో మార్పుచేర్పులు జరపాలని సూచించనుంది. సర్వేలో భాగంగా ఉద్యోగి కులం, ఉప కులం, ప్రభుత్వ శాఖ, విభాగం, జిల్లా, లింగం, స్థూలవేతనం, విద్యార్హతలు, నియామకం చేసిన ఉద్యోగ సంస్థ, మిగిలి ఉన్న సర్వీసు కాలం, క్యాడర్, హోదా, సర్వీసులో చేరినప్పటి వయసు, పట్టణం, గ్రామీణం.. తదితర అంశాలను బీసీ కమిషన్ సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల రిజర్వేషన్ల పెంపునకు సైతం ఈ అధ్యయనం ఉపయోగపడనుంది.
ఈ అంశాల వారీగా బీసీ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం సేకరిస్తోంది
- కులాలు, ఉప కులాల వారీగా రూ.20 వేలలోపు నుంచి రూ.2 లక్షలకు పైగా స్థూల వేతనం అందుకుంటున్న వారి వివరాలు
- పదో తరగతి లోపు నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్హతలున్న వారి వివరాలు
- ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, డీఎస్సీ, ఏపీపీఆర్బీ, టీఎస్‌పీఆర్బీ, కారుణ్య నియామకాలు, ఇతర పద్ధతుల్లో నియమితులైనవారి వివరాలు
- ఏ వయసులో ఉద్యోగంలో చేరారన్న సమాచారం
- హైదరాబాద్, జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి జిల్లాల కేంద్రాలు, కొత్త జిల్లాల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నవారి వివరాలు