సాక్షి, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన పున్నం లింగయ్య మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ముగ్గురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది. ఖమ్మం ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం ఉదయం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని, సాయంత్రం 6 గంటల్లోగా రీ పోస్టుమార్టం నిర్వహించి వాటి నివేదికలను ఈ నెల 5న తమకు నివేదించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని లింగయ్య కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. విచారణను 5కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది.
మృతదేహంపై గాయాలున్నాయా?
లింగయ్యను రాళ్లగడ్డ అటవీ ప్రాంతంలో గత నెల 31న పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో పొట్టనబెట్టుకున్నారని, బూటకపు కాల్పుల్లో చంపేసి ఎన్‌కౌంటర్ అని పోలీసులు చెబుతున్నారని పేర్కొంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాల్పులు జరిపిన పోలీసులపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదించారు. ఆదివాసీల హక్కుల కోసం లింగయ్య పోరాడేవారని, పోడు వ్యవసాయం చేసేందుకు ఆదివాసీలకు మద్దతుగా ఉండటం ప్రభుత్వానికి నచ్చలేదని పేర్కొన్నారు. లింగయ్యను పోలీసులు అక్రమంగా తమ కస్టడీలోకి తీసుకుని చంపేశారని ఆరోపించారు. కొత్తగూడెం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పడేశారని, అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, మహారాష్ట్ర హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన గుండాల స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌పై హత్యానేరం కింద 302 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. లింగయ్య మృతదేహానికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లుగా ఎలా చెబుతున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, మృతుడి బంధువుల సమాచారమని, మృతదేహాన్ని బంధువులు చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని ఆయన బదులిచ్చారు. ఎన్‌కౌంటర్ పేరుతో ఇదే తరహాలో గతంలో శేషాచల అడవుల్లో ఏకంగా 12 మంది చనిపోయారని, వారి మృతదేహాలకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రీపోస్టుమార్టం జరిగిందని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. లింగయ్య దగ్గర ఆయుధాలు ఉన్నాయని, పోలీసులపై కాల్పులు జరిపాడని, ఆ తర్వాతే పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని చెప్పారు. తీవ్రవాదంతో దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. పోస్టుమార్టం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుని.. మృతదేహంపై గాయాలున్నాయని, బూటకపు ఎన్‌కౌంటరని పిటిషనర్ ఆరోపిస్తున్నందున రీ పోస్ట్‌మార్టం, రీ అటాప్సీ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కాగా, ఈ కేసులో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, గుండాల ఎస్‌హెచ్‌ఓ, భద్రాద్రి కొత్తగూడెం ఆస్పత్రి సూపరింటెండెండ్‌లను చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment