సాక్షి, సిటీబ్యూరో: మహమ్మారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ బుధవారం నాటికి సరిగ్గా నెల రోజులకు చేరుకొంది. కరోనా ఉధృతి దృష్ట్యా మే 7వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఆ తరువాతైనా కరోనా తగ్గుముఖం పడుతుందా...లాక్‌డౌన్ తొలగిపోతుందా అనేది సందిగ్ధమే. కానీ ఈ నెల రోజులుగా బస్సులు, రైళ్లు, విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బహుశా చరిత్రలోనే అతి పెద్ద ప్రజారవాణా నెట్‌వర్క్ స్తంభించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రయాణికులు ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి ప్రయాణాలు, టూర్లు, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం చేయవలసిన అన్ని రకాల ప్రయాణాలు నిలిచిపోయాయి. సొంత ఊళ్లకు వెళ్లలేక. దూరప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చేరుకొనేందుకు అవకాశం లేక ఇళ్లల్లోనే ఉండి విలవిలలాడుతున్నవాళ్లు, వివిధ కారణాల వల్ల కుటంబసభ్యులు చెల్లాచెదురుగా ఒక్కొక్కరు ఒక్కో చోట ఉండాల్సి వస్తోంది.
నిలిచిపోయిన సిటీ బస్సులు...
గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలకు చెందిన 3000 బస్సులు డిపోలకే పరిమితమాయ్యాయి. ప్రతి రోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఈ నెల రోజులుగా గ్రేటర్ ఆర్టీసీ సుమారు రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఉద్యోగ,వ్యాపార అవసరాల కోసం పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు సిటీ బస్సులే అందుబాటులో ఉన్నాయి. బస్సులు నిలిచిపోడం వల్ల చాలామంది ఇల్లు వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి అవసరాల కోసం సొంత వాహనాలపైన రాకపోకలు సాగించేవాళ్లు ఉన్నప్పటికీ బస్సులు లేకపోవడం వల్ల నగరంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లలేకపోతున్నట్లు పలువురు వాపోతున్నారు.
ఇల్లు దాటి బయటకు రాలేదు
ప్రతి రోజు మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్, ఎస్‌ఆర్ నగర్, బేగంపేట్ వైపు ఏదో ఒక పనిపైన వెళ్లేవాళ్లం. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లాక్‌డౌన్ సమయంలో మాస్కులు, ఆహారం,నిత్యావసరాలు వంటివి అందజేస్తున్నాం. కానీ బస్సులు లేవు కదా ఎక్కువ మందిని చేరుకోవడం సాధ్యం కావడం లేదు.– సుధ, మల్కాజిగిరి
మొట్టమొదటిసారి ఆగిన ఫ్లైట్
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2008లో విమాన సర్వీసులు ప్రారంభమైన తరువాత మొట్టమొదటిసారి లాక్‌డౌన్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు బ్రేక్ పడింది. ప్రతి రోజు 400 కు పైగా విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 60 వేల మంది ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రయాణికులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల రోజుల్లో సుమారు 18 లక్షల మంది ప్రయాణాలు స్తంభించాయి.
యూఎస్‌లో మా ఆవిడ,ఇక్కడ నేను
మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. కూతురు డెలివరీ దృష్ట్యా మా భార్య కామేశ్వరి అక్కడకు వెళ్లింది. ప్రస్తుతం నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నాను. ఈ నెలలో నేను కూడా అక్కడకు వెళ్లవలసింది. మే నెలలో ఇద్దరం తిరిగి హైదరాబాద్ రావాలనుకొన్నాం. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో ఏమో టెన్షన్‌గా ఉంది. రామచందర్రావు, మల్కాజిగిరి
చరిత్రలో ఇది రెండోసారి..
దేశవ్యాప్తంగా రైళ్లు నిలచిపోవడం ఇది రెండోసారి. ఎమర్జెన్సీ కాలంలో జాతీయ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు రైళ్లను నిలిపివేశాయి.కానీ చాలా స్వల్ప కాలం. ఇప్పుడు నెల రోజులుగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగాయి. ఆ రకంగా ఇంత సుదీర్ఘకాలం రైళ్లు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దక్షిణమధ్య రైల్వేలో ప్రతి రోజు 600 కు పైగా రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. హైదరాబాద్ నుంచే 200 రైళ్లు దేశవ్యాప్తంగా రవాణా నెట్‌వర్క్ కలిగి ఉన్నాయి. 2లక్షల మందికి పైగా సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మరో 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రైళ్లు నిలిచిపోవడం వల్ల ఈ నెల రోజుల్లో రూ.300 కోట్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గత నెలలోనే రాజమండ్రికివెళ్లాల్సింది
మార్చి 23న రాజమండ్రికివెళ్లవలసి ఉండింది. జనతా కర్ఫ్యూ తరువాత మరుసటి రోజు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ అదేరోజు లాక్‌డౌన్ అనౌన్స్ చేశారు. దీంతో ఇంటికే పరిమితమయ్యాం. బయటకు వెళ్లలేని పరిస్థితి. చూస్తుంటే అప్పుడే నెల రోజులు గడిచిందా అనిపిస్తోంది.– కవిత, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment