
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వర్సిటీలకు అకడమిక్ సహకారం అందించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అమెరికాలోని పిట్స్‌బర్గ్ వర్సిటీతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పిట్స్‌బర్గ్ వర్సిటీ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రోవోస్ట్ డాక్టర్ ఏరియల్ ఆర్మోనీ పరస్పరం ఎంవోయూలను మార్చుకున్నారు. ఏరియల్ ఆర్మోని మాట్లాడుతూ, 1787లో ఏర్పాటైన తమ వర్సిటీ వైద్యం, విద్య, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ రంగాల్లో బోధన, పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వర్సిటీ అమెరికాలో 5 క్యాంపస్‌లు, 28 వేల మంది విద్యార్థులను కలిగి ఉందన్నారు.
ఈ ఎంవోయూ ద్వారా రాష్ట్రం లోని వర్సిటీలు, పిట్స్‌బర్గ్ వర్సిటీల మధ్య పరస్ప రం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, పరిశోధనల్లో సహాయసహకారం లభించనుందని పాపిరెడ్డి పేర్కొన్నారు. పిట్స్‌బర్గ్ వర్సిటీ అందిస్తున్న ఉత్తమ కోర్సులు, సబ్జెక్టులను రాష్ట్రంలోని వర్సిటీల్లో ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు, పరిశోధన కేంద్రాలతో పిట్స్‌బర్గ్ వర్సిటీ అనుసంధానమై విద్యాపరిశోధనలు, విద్యాబోధన అంశాల అభివృద్ధికి సహకారం అందించనుందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫె సర్ లింబాద్రి, వెంకటరమణ పాల్గొన్నారు. ఎంవోయూ అనంత రం పిట్స్‌బర్గ్ ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసింది.