సాక్షి, సిటీబ్యూరో: ‘ఆర్టీసీ ఉద్యోగమంటే జీవి తాంతం ప్రశాంతంగా బతుకొచ్చుననే భరోసా ఉండేది. రిటైర్మెంట్ గడువు దగ్గర పడిందంటే... అయ్యో అప్పుడే ఆర్టీసీని వదిలి వెళ్లాల్సి వస్తుందా అని ఆందోళనకు గురయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఏ రోజు ఎలాంటి వేధింపులను ఎదుర్కోవలసి వస్తుందో తెలియని అభద్రతతో పని చేయాల్సి వస్తుంది. ఆర్టీసీ కార్మికుల ‘సంక్షేమం’ ఇలా ఉంటుందనుకోలేదు....’’ ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఒక సీనియర్ కండక్టర్ ఆవేదన ఇది. అధికారులు వేధింపుల కారణంగా డ్యూటీ చేయాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రీవెన్స్‌సెల్ బాక్సులో వేసి ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు లేవని చెప్పాడు. కేవలం 20 కిలోమీటర్లు తక్కువ నడిపారనే కారణంతో అదే డిపోకు చెందిన 12 మంది కండక్టర్, డ్రైవర్‌లను ముషీరాబాద్–2 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపోకు బదిలీ చేయడంపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, తదితర సిబ్బందిపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. డిపోస్థాయిలో ఏర్పాటు చేసిన కార్మికుల సంక్షేమ కమిటీలు అలంకారప్రాయంగా మిగిలాయి.
ఫిర్యాదుల పెట్టెలోనే ‘సంక్షేమం’....
ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. 55 రోజుల సమ్మె అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి డిపో స్థాయిలో మేనేజర్, ఒక చీఫ్ ఇన్‌స్పెక్టర్, ఒక మెకానికల్ ఫోర్స్‌మెన్, మరో ఇద్దరు డ్రైవర్, కండక్టర్‌లతో కమిటీలను ఏర్పాటు చేశారు. డిపోల్లో పని చేసే కార్మికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు గ్రీవెన్స్‌సెల్‌గా ఇది పని చేయవలసి ఉంది. డిపో కమిటీల స్థాయి వెల్ఫేర్ కమిటీల్లో పరిష్కారం కాని సమస్యలను రీజనల్ మేనేజర్ స్థాయిలో పరిష్కరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించవలసి ఉంది. నగరంలోని 29 డిపోల్లో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క డిపోలోనూ తమ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదని కండక్టర్లు, డ్రైవర్‌లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.‘‘ డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. అదనపు జీతం ఇవ్వడం లేదు. సీనియారిటీని లెక్కలోకి తీసుకోవడం లేదు. డిపోమేనేజర్‌ను కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశంలేదు’ ఉప్పల్ డిపోకు చెందిన ఒక డ్రైవర్ విస్మయం వ్యక్తం చేశారు.
బస్సులు తగ్గించి పని భారం పెంచారు...
గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలున్నాయి. గ్రేటర్‌లో సుమారు 1000 బస్సులను రద్దు చేశారు. వాటిలో కొన్నింటిని కార్గోలుగా మా ర్చారు. అకస్మాత్తుగా 10 వేల ట్రిప్పులకు పైగా తగ్గాయి. ఇక మిగిలిన 2500 బస్సులే ఆదాయ మార్గంగా మారాయి. దీంతో గతంలో ఉన్న 7.5 గంటల పని విధానం అటకెక్కింది. కండక్టర్‌లు, డ్రైవర్‌లపైన పని భారం పెరిగింది. ‘ఇప్పుడు రోజుకు 9 గంటలు పని చేస్తున్నాం, అయినా ఏదో ఒక రోజు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఒకటి, రెండు ట్రిప్పులు రద్దయితే ఇంక్రిమెంట్‌లను వాయిదా వేస్తున్నారు.’ అని ముషీరాబాద్–1 డిపోకు చెందిన కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక బస్సుకు రూ.4500 ఎర్నింగ్స్ టార్గెట్‌గా ఉంటే ఏదో ఒక రోజు రూ.3500 వచ్చిందంటే చాలు ఆ రోజు కండక్టర్, డ్రైవర్‌కు మూడినట్లే...’అని కంటోన్మెంట్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. కేఎంపీఎల్ తగ్గినా డ్రైవర్‌లపైన వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు...
బస్సుల సంఖ్యను తగ్గించి, ట్రిప్పులు కుదించి సిబ్బందిపై ఒత్తిడిని తీవ్రతరం చేసినప్పటికీ నగరంలో ప్రయాణికులకు సరైన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో ఆర్టీసీ దారుణంగా విఫలమవుతోంది. నగర శివార్లకు, కాలనీలకు బస్సులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనేక ప్రాంతాల నుంచి రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లకు చేరుకుంటాయి. కానీ ఆ సమయంలో సిటీ బస్సులు డిమాండ్‌కు తగిన విధంగా అందుబాటులో ఉండడం లేదు. ఉదయం 6.30 తరువాత మాత్రమే బస్సులు డిపో నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు క్యాబ్‌లు, ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment