సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలు దేరిన ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మొహరించి విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడికి విపక్ష నేతలు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. సీపీఎం, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ డీఐవైఎఫ్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అరెస్టు సమయంలో పరుష పదజాలంతో దూషించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వీరికి దళిత సంఘాలు, సీపీఎం, బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సామూహిక దీక్షను చేపట్టారు. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ సామూహిక దీక్షను ప్రారంభించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment