కేసీఆర్‌పై సీబీఐ కేసులు..!
► కేసీఆర్‌ను సీబీఐ అధికారులు నాలుగుసార్లు ప్రశ్నించారు
► మోదీ పేరు వింటే సీఎంకు మోకాళ్లు వణుకుతాయి
► టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెడకు చుట్టుకున్న సీబీఐ కేసుల భయంతోనే ప్రధానమంత్రి మోదీకి మోకరిల్లుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు సీఎం అయిన తర్వాత నాలుగుసార్లు కేసీఆర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెప్పారు. కేసుల నుంచి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లేరాష్ట్రంలో నగదుకొరత ఏర్పడిందని, రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణపై జీఎస్టీ వల్ల 20వేల కోట్ల భారం పడుతుందన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఈఎస్‌ఐ ఆసుపత్రుల కుంభకోణంలోనూ, సహారా ఇండియాకు చెందిన ప్రావిడెంట్‌ఫండ్ కుంభకోణంలోనూ సీబీఐ కేసులను నమోదుచేసిందని వివరించారు. ఈ కేసులే ఇప్పటికీ కేసీఆర్‌పై ఉన్నాయని, మద్రాసు నుంచి 20 మందికి పైగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి నాలుగుసార్లు ప్రశ్నించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ వార్తలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. ఈ కేసుల భయంతోనే ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరికంటే ముందుగా కేసీఆర్ మద్ధతును ఇస్తున్నాడని చెప్పారు. ప్రధాని మోదీ పేరు వింటే సీఎం కేసీఆర్‌కు మోకాళ్లు వణుకుతున్నాయని ఎద్దేవాచేశారు.