- సమగ్ర సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక
- వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం
- ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఎట్టకేలకు కదలిక మొదలైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల పర్యటన సమయంలో దానిపై అడపాదడపా ప్రకటనలు చేస్తూ వస్తున్న సీఎం బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహా దారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ఆ శాఖ గత కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రస్తుత కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ బోర్డు ఎండీ మహేశ్ దత్ ఎక్కా పాల్గొన్నారు.
ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ప్రకటించిన ఆయన తెలంగాణవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలుపెడుతున్నట్టు వెల్లడిం చారు. సమగ్ర సర్వే ఆధారంగా ఇళ్లు లేని వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేసుకుని దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉం టుందని పేర్కొన్నారు.
హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాలలో ప్రయోగాత్మకంగా పట్టణ గృహ నిర్మా ణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడించారు.
ఆ అవినీతి మరకలొద్దు
గతంలో ఓట్ల వేట లక్ష్యంగా గృహనిర్మాణ పథ కం కొనసాగి చివరకు అవినీతికి ఆలవాలంగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లక్షల ఇళ్లు మంజూరై, వేల కోట్లు ఖర్చయినా ఇంకా ఇళ్లులేని నిరుపేదలు ఉన్నారంటేనే పథకం సాగిన తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్తోందన్నారు. నాటి అవకతవకలపై సీఐడీ విచారణలో ప్రతి గ్రామంలో తప్పులు జరిగాయని తేలుతోందన్నారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప పేరుతో జరిగిన ఇళ్ల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి వాటి విషయంలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వృథా ఇళ్ల వినియోగంపై సూచనలు అందజేయాలని పేర్కొన్నారు.