వేములవాడ: ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 13, 14 రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 600 నుంచి 700 మంది వరకు ఉంటారని, వీరందరికీ అగ్రహారం కాలేజ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వీరికి శిక్షణ ఇచ్చే వారికి జిల్లా కేంద్రంలో శుక్రవారం మాస్టర్ లెవల్ ట్రైనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రతీ ఉద్యోగి తప్పకుండా ఈ శిక్షణలో పాల్గొనాలని ఆదేశించారు.
సెలవులైనా ఆదేశాలు జారీ చేయాలి...
రెండవ శనివారం సెలవుదినం అంటూ ఎన్నికల విధులనకు దూరం ఉండొద్దని, రెండవ శనివారం అయినా ఉపాధ్యాయులందరికీ ఈనెల 13, 14 తేదీల్లో ఎన్నికల శిక్షణలో పాల్గొనేందుకు ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సెలవుల పేరుతో ఎన్నికల విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్:
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 12న విడుదల అవుతుందని, ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌కు లోబడి అభ్యర్థులు తమతమ నామినేషన్ పత్రాలు అందజేయాలన్నారు. అభ్యర్థులకు సరైన సలహాలు, సూచనల కోసం తహసీల్దారు కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోటీ చేసే వారు ఎలాంటి సలహాలు, సందేహాలైనా ఈ డెస్క్ నుంచి పొందవచ్చన్నారు.
మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్
Comments
Please login to add a commentAdd a comment