
శ్రీరంగాపురం/అమ్రాబాద్ (అచ్చంపేట): వడదెబ్బ కారణంగా బుధవారం ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని జానంపేటకు చెందిన హనుమన్న గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. జిల్లాలో పశు గ్రాసం కొరత ఏర్పడటంతో గొర్రెల మందతో ఏపీలోని కర్నూలు జిల్లా ఎదురూరు వెళ్లాడు.
అక్కడే కొద్దిరోజులుగా ఉంటున్న ఆయనకు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తాకడంతో మృతి చెందాడు. మరో సంఘటనలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే) గ్రామానికి చెందిన బొంత బాలయ్య(55) వేరుశనగ చేను కాపలాకు వెళ్లగా వడదెబ్బ తగలడంతో పొలంలోనే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడు. పక్క పొలాల్లోని రైతులు సాయంత్రం ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు.