కోల్‌బెల్ట్(భూపాలపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో కొంత కాలంగా విధులు నిర్వహించి పలు కారణాలతో దిగి పోయిన విశ్రాంత కార్మికుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. సింగరేణిలో ఉద్యోగం చేయాలంటే నాడు భయపడే రోజుల్లో కొంత మందిని బలవంతంగా అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. మరికొంత మంది తప్పని పరిస్థితుల్లో ఏ ఆధారం లేని వారు సింగరేణిలో బినామీ పేరుతో పనులు చేశారు. వివిధ హోదాల్లో సుమారు 30 ఏళ్లపాటు పనులు చేసి ఉద్యోగ విరమణ అనంతరం వారి పరిస్థితి అయోమయంగా మారింది. అసలు పేరు ఒకటి ఉండటం, సింగరేణిలో మరో పేరు ఉండటం మూలంగా ఉద్యోగ విరమణ అనంతరం సంస్థ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందక రెంటికి చెడ్డ రేవడిగా మారింది విశ్రాంత కార్మికుల పరిస్థితి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 500 పైగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సంస్థ నుంచి లభించని సహకారం..
రెండు పేర్లతో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి ఎటువంటి సహకారం లభించక పోవటం ఆయా కుటుంబాల పరిస్థితి అరణ్య రోదనగా మారింది. సింగరేణిలో డబుల్ నేమ్ కలిగిన వారు సమస్యను ఎదుర్కొంటున్నారు. సంస్థలో ఓ పేరు, బయట అసలు పేరు ఉండటం వారు ఇప్పటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక మదన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారు సంస్థలో ఉన్న పేరుతో మాత్రమే పెన్షన్ పొందుతుండగా వారి డిపెండెంట్‌లు అసలు పేరుతో ఉండటం మూలంగా వారసత్వఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది.
సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో సైతం వీరు అనర్హులుగా మిగలటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ ఇంటిపేరు, పేరులో తప్పులు ఉంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. అదే మాదిరిగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పేర్లు తదితర వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలని సింగరేణి వ్యాప్తంగా కోరుతున్నారు. ఇందుకు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సైతం చొరవ చూపాలని ప్రాధేయ పడుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో 2017లో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సైతం వన్‌టైం సెటిల్‌మెం ట్ కింద డబుల్ నేమ్ కలిగిన వారికి అవకాశం కల్పించాలని కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను కోరారు. సమస్యను సత్వరం పరిష్క రించాలని విశ్రాంత కార్మికులు కోరుతున్నారు.
చిన్న తప్పిదంగా భావించాలి
వాస్తవానికి సింగరేణిలో ఉద్యోగం చేసేందుకు భయపడిన రోజుల్లో జరిగిన చిన్న తప్పిదానికి జీవితాంతం విశ్రాంత కార్మికులు నష్ట పోతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఈ విషయంలో
యాజమాన్యాన్ని ఒప్పించి సవరించాలి. – పసునూటి రాజేందర్, ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు
సవరణకు అవకాశం ఇవ్వాలి
అనుకోని పరిస్థితుల్లో ఇతర పేర్ల మీద పని చేస్తున్న కార్మికులు, విశ్రాంత కార్మికులకు తమ పేర్లను సవరించుకొనేందుకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే డబుల్ నేమ్ మూలంగా వందలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ నుంచి వచ్చే ప్రయోజనాలు సైతం కోల్పోతున్నందున మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. – ఎం.రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment