
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి రెండు బోర్డుల అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు తదితరులు హాజరు కానున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా రెండు బేసిన్‌ల ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టుల కింద నీటి వినియోగం, కృష్ణాబోర్డు విజయవాడకు తరలింపు వంటి అంశాలతో పాటు పట్టిసీమ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిలోంచి తెలంగాణకు 45 టీఎంసీల వాటా కేటాయింపు, తాగునీటికి కేటాయించిన నీటిలో కేవలం 20 శాతం మాత్రమే వినియోగం కింద లెక్కింపు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. దీంతోపాటు తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా లేదా కేంద్ర సాయం అందించాలని తెలంగాణ కోరనుంది.