నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్‌లో ఓ వ్యాపారి అమ్మకానికి తీసుకువచ్చి దుకాణంలోని టపాసులు పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు.
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్‌లో ఓ వ్యాపారి అమ్మకానికి తీసుకువచ్చి దుకాణంలోని టపాసులు పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరొకరు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. భువనగిరి ఆర్బీ నగర్‌లో వ్యాపారి పెద్ది శ్రీనివాస్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు టపాసులు తీసుకువచ్చి దుకాణంలో ఉంచాడు.
తన దుకాణంలో కరెంట్ సమస్య ఉందని శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావు(50)కి ఫోన్ చే యడంతో అతడు వచ్చాడు. అదే సమయంలో టపాసులు కొనేందుకు కల్యాణ్(22), పోశెట్టి వచ్చారు. అంతలోనే సెల్‌ఫోన్ ఓవర్‌హీట్ కారణంగా టపాకాయలకు అంటుకుని పెద్దఎత్తున మంటలు లేశాయి. గదిలో ఉన్న ముగ్గురికీ మంటలు అంటుకున్నాయి. వారిలో నాగేశ్వర్‌రావు , కల్యాణ్ అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. పోశెట్టి తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దఎత్తు టపాసులు పేలిన శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది.