దళారుల దందా.. | Unemployeds Problems With Fake Jobs Khammam | Sakshi
Sakshi News home page

దళారుల దందా..

Jun 14 2019 6:57 AM | Updated on Jun 14 2019 6:57 AM

Unemployeds Problems With Fake Jobs Khammam - Sakshi

కేటీపీఎస్‌ ప్లాంట్‌

సాక్షి, కొత్తగూడెం: నిరుద్యోగులను మోసం చేసేందుకు మాయగాళ్లు ఎప్పుడూ పొంచి ఉంటారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం పారిశ్రామిక జిల్లా కావడంతో ఆయా సంస్థల్లో క్యాజువల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో ఈ మాయగాళ్లు నిరంతరం దోపిడీ చేస్తున్నారు. తాజాగా పాల్వంచలోని కేటీపీఎస్‌(కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌)లో ఆర్టిజన్‌ పద్ధతిలో ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో ఉమ్మడి జిల్లాలోని పలువురు అమాయకుల వద్ద భారీగా డబ్బు వసూలు చేశారు. ఇతర విద్యుత్‌ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ పర్మనెంట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ జెన్‌కో, టీఎస్‌ ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెండు విడుతలుగా ఆర్టిజన్‌ల పేరుతో నియామక పత్రాలు ఇచ్చారు. 2017 జూన్‌ 27న మొదటి విడతలో, అదే ఏడాది జూలై 27న రెండో విడతలో సదరు కాంట్రాక్ట్‌ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించారు.

సంస్థల్లో కాంట్రాక్ట్‌ వ్యవస్థను తీసివేసి కర్మాగారాల్లో ప్రతి పనులను కాంట్రాక్ట్‌ కార్మికులతో చేయించుకుని వారికి నేరుగా బోర్డు నుంచే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వీరికి ఉద్యోగ భద్రత లభించినట్టయింది. ఇందులో పాల్వంచ కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌ పరిధిలో సుమారు 1,500 మంది ఉద్యోగాలు పొందారు. అయితే ఆర్టిజన్‌లుగా తీసుకునే క్రమంలో అర్హులైన కొందరికి ఉద్యోగాలు రాలేదు. పైగా కొందరు అనర్హులు సైతం దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందారు. దశాబ్దాల పాటు నమ్ముకుని పనిచేసిన పలువురు కార్మికులు మాత్రం నష్టపోయారు. సదరు కార్మికుల వద్ద  అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఆర్టిజన్‌లుగా, సీఎల్‌(క్యాజ్‌వల్‌ లేబర్‌)లుగా తీసుకోకపోవడంతో వారంతా జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచ కేటీపీఎస్‌ 7వ దశ ప్లాంట్‌ను సందర్శించిన సమయంలో అర్హులైన వారికి న్యాయం చేస్తామని, మూడవ విడత జాబితా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

సీఎండీ ఇచ్చిన హామీని అవకాశంగా చేసుకుని కొన్ని కార్మిక సంఘాల నాయకులు, మధ్య దళారులు కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటు అమాయక నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రుపాయలు దండుకుంటున్నారు. దళారుల దందా బారిన పాల్వంచ, బూర్గంపాడు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల వారు పడినట్లు తెలుస్తోంది. యాజమాన్యం తక్షణమే చొరవ తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తే కేటీపీఎస్‌ 6వ దశ నిర్మాణ కార్మికులతో పాటు కొన్ని విభాగాల్లో పనిచేసిన కార్మికులు సుమారు 400 మించి ఉండరు. కానీ ఇప్పటికే వందలాది మంది వద్ద మాయగాళ్లు అక్రమంగా వసూళ్లు చేయడం గమనార్హం. చివరికి ఉద్యోగాలు వస్తే అవి తమ వల్లనే వచ్చాయని చెప్పి డబ్బులు ఉంచుకునేందుకు దళారులు పన్నాగం పన్నారు. ఉద్యోగాలు రాని వారి విషయంలో మాత్రం ఖర్చుల పేరుతో సగం నొక్కేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఇప్పటికైనా యాజమాన్యం అర్హులైన కార్మికులెవరో గుర్తించి వారి జాబితాను రూపొందించాలని, విచారణ చేసి బహిరంగంగా తెలియజేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తే అమాయక ప్రజలు నష్టపోకుండా చూడొచ్చని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement