
గవర్నర్ అధికారాలపై కేంద్రం వెనక్కు!
తమకు సమాచారం ఉందని మంత్రి నాయిని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టాలన్న ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకున్నట్టు తమకు సమాచారం ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ పోలీసు సంఘం ఆధ్వర్యంలో ప్రతి నిధి బృందం ఆయన్ను కలిసి 50 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా విలేకరులతో నాయిని మాట్లాడుతూ.. పై విషయాన్ని వెల్లడించారు. అలాగే రైతుల పట్ల పోలీసులు సంయమనం పాటించాలని, లాఠీలు ఉపయోగించకుండా చూడాలని స్పష్టంచేశారు. ప్రజలను స్నేహపూర్వకంగా చూడాలని, అది చేతకాకపోతే తన వద్దకు పంపాలని పోలీసులకు చురకలంటించారు. చట్టానికి ఎవరైనా లోబడే పనిచేయాలని తేల్చిచెప్పారు. పోలీసులు సరిగా పనిచేస్తే స్థానికంగా అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
తెలంగాణ ఇమేజ్‌ను పెంచేందుకు కృషి చేయాలని పోలీసులకు సూచించారు. రైతుల ఆందోళనల్లో తప్పు లేదని, వారు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. కరెంటు ఇబ్బందులు కొన్నాళ్ల తర్వాత ఉండవని పేర్కొన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే ఇప్పుడు విద్యుత్ కొరత వేధిస్తోందన్నారు. సింగరేణిలో కొత్త మైన్స్ ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 19న జరగబోయే ఇంటింటి సర్వేలో అవసరమైతే పోలీసులు కూడా సివిల్ డ్రెస్‌తో పాల్గొని సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు.