కేంద్రంలో తెలంగాణ గొంతుక.. దత్తన్న
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు పౌర సన్మాన సభలో సీఎం కేసీఆర్
పక్కరాష్ట్రం పెట్టే ఇబ్బందులను కేంద్రం దృష్టికి తేవాలి
ఆయన బండారు కాదు... బంగారు దత్తాత్రేయ
మోదీ టీమ్‌లో కేసీఆర్ కూడా ఒకరని విశ్వసిస్తున్నా : దత్తాత్రేయ
కరెంటు కష్టాలు తీర్చేందుకు.. కేసీఆర్ - మోదీలను కలిపేందుకు సిద్ధం
హైదరాబాద్: కరెంటు విషయంలో పక్క రాష్ట్రం ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో తెలంగాణ గొంతుకగా మారాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అభిలషించారు. తాజా ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదని మధనపడుతున్న తరుణంలో.. దత్తాత్రేయకు మంత్రివర్గంలో చోటు దక్కటంతో ఆ లోటు భర్తీ అయిందన్నారు. బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తెలంగాణ బీజేపీనేత చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు కొద్దిరోజుల క్రితం ఇదే తరహాలో పౌరసన్మానం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం ఆ ఒరవడిని కొనసాగిస్తూ బండారు దత్తాత్రేయను సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి కేంద్రమంత్రిగా దత్తాత్రేయ పేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సౌమ్యులు, మృదుభాషి, చక్కటి మనస్తత్వం కలిగిన బండారు దత్తాత్రేయ.. తన దృష్టిలో ‘బంగారు’దత్తాత్రేయ అని పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా కేంద్రంలో పనిచేసే ఈ ప్రాంత ముద్దుబిడ్డ దత్తాత్రేయను సన్మానించటమంటే తెలంగాణ సమాజం తనను తాను సన్మానించుకోవటమేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో దత్తాత్రేయ పాత్ర కీలకమైందని, ‘అలయ్ బలయ్’ పేరుతో అన్నివర్గాల ప్రముఖులను ఒక్క వేదికపైకి తేవటం ద్వారా ఉద్యమానికి ఆయన ఊతమిచ్చారని ప్రశంసించారు. ఏటా నిర్వహించే ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అభిలషించారు.
కరెంటు కష్టాల పరిష్కారం కోసం మోదీతో మాట్లాడిస్తా..
తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకునే కార్యక్రమాలకు కేంద్రమంత్రి హోదాలో తాను పూర్తి అండగా ఉంటానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ముందుకొస్తే.. ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరెంటు కష్టాల విషయంలో కేంద్రం చొరవ చూపేలా మోదీ -కేసీఆర్‌లను కలిపేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కేంద్రమంత్రిగా తాను తెలంగాణకు ఓ ప్రపంచస్థాయి మెడికల్ కళాశాలను బహుమతిగా ఇస్తున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు. రూ.435 కోట్లతో సనత్‌నగర్‌లో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మోదీ టీమ్‌లో కేసీఆర్ కూడా ఒకరనే తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. ఇక బీడీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన మొత్తాన్ని రూ.45 వేల నుంచి రూ.లక్షకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. గతంలో ఇది రూ. 25 వేలుగా ఉంటే అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ దాన్ని రూ. 45 వేలకు పెంచారని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రాంత నేతలకు అచ్చొచ్చినట్టు అనిపిస్తోందని, గతంలో ఇదే శాఖను అంజయ్య, వెంకటస్వామి, కేసీఆర్ నిర్వహిస్తే ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందన్నారు. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కొత్తగా వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని, వారు దోపిడీకి గురికాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పత్తి రైతులకు రూ.4050 మద్దతు ధర లభించేలా సంబంధిత కేంద్రమంత్రులు, అధికారులతో ఇటీవలే తాను ప్రత్యేకంగా భేటీ అయి ఆదేశాలు ఇప్పించానన్నారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టు అద్భుతమని, హుస్సేన్‌సాగర్‌కు పూర్వవైభవం తెచ్చి మంచినీటి చెరువుగా మార్చే ఆలోచన గొప్పదన్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆత్మీయత ఓ భాగమని, ఈ సన్మానమే దానికి నిదర్శనమన్నారు. తన ఈ ఉన్నతికి సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావే కారణమని పేర్కొన్నారు. సీఎల్పీనేత జానారెడ్డి, బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్, టీడీపీ నేత మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరెంట్ లేకనే రైతు ఆత్మహత్యలు
తెలంగాణలో వ్యవసాయం బోరు బావులపై ఆధారపడడం, విద్యుత్ సమస్య తదితర కారణాల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. వరి పరిశోధనా సంచాలయంలో శనివారం జరిగిన రైతు దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2019 నాటికి మోదీ ప్రభుత్వం గ్రామ గ్రామానికి 24 గంటల కరెంటు ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. రబీలో వరి వేసుకోవచ్చని వరి పరిశోధనా సంచాలయం ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ రవీంద్రబాబు రైతులకు సూచించారు. సభలో, అంతకుముందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ రబీలో వరి వేయొద్దంటూ చేస్తున్న విజ్ఞప్తులను ఆయన తోసిపుచ్చారు. రెండు మూడేళ్లలో సాంబమసూరి అన్ని చీడపీడలన్నింటినీ తట్టుకునే విధంగా బహుళ నిరోధక శక్తి ఉండేలా తయారు చేస్తామన్నారు. రెండేళ్లలో న్యూట్రిషన్, ఐరన్, జింక్‌లు ఉండే వరిని అభివృద్ధి చేస్తామని రవీంద్రబాబు చెప్పారు.