
ఆత్మహత్య చేసుకుంటున్నా... నేనెవరో కనుక్కోండి...!
‘నా ఆత్మహత్యకు ఎలాంటి కారణాలూ లేవు. ఆత్మహత్య చేసుకోవాలని చిన్నప్పటి నుంచే అనుకుంటున్నాను. ముక్కలు ముక్కలైన నా బాడీ(శరీరం)ని నా వాళ్లకు అందజేయండి. నా పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇందులో (పజిల్) ఉన్నాయి. కనుక్కోండి...’ఆత్మహత్య చేసుకున్న గుర్తుతెలియని యువకుడి వద్ద దొరికిన ఇంగ్లిష్‌లో రాసిన సూసైడ్ నోట్ ఇది..!
ఖమ్మం క్రైం: గుర్తు తెలియని ఓ యువకుడు శుక్రవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జీఆర్‌పీ ఎస్‌ఐ రవిరాజు తెలిపిన ప్రకారం... నగరంలోని శ్రీరాం హిల్స్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ యువకుడు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎదురుగా రైలు వస్తున్నప్పటికీ అతడు పక్కకు తప్పుకోలేదు. రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిని దూరం నుంచి చూసిన స్థానికులు కొందరు.. రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ యువకుడి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇతని ఎడమ చేతికి పోలియో వచ్చింది. ఇతని వద్ద దొరికిన బ్యాగ్‌లో ఖరీదైన కళ్ళ జోడు, ఉడ్‌ల్యాండ్ షూ, ‘ది లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్’ అనే పుస్తకం, ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు వెళ్లేందుకు గురువారం రాత్రి తీసుకున్న టికెట్ ఉన్నాయి. వీటితోపాటు, ఇంగ్లిష్‌లో రాసిన సూసైడ్ నోట్, పజిల్‌తో కూడిన కాగితం ఉన్నాయి.
సూసైడ్ నోట్‌లో... ‘‘నేను చిన్నప్పటి నుంచి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నా ఆత్మహత్యకు ప్రేమ విఫలంగానీ, ఇతరత్రా కారణాలుగానీ ఏమీ లేవు..’’ అని ఉంది. మరో కాగితంపై ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలు ఉన్నాయి. వాటిలో కొన్ని పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి. ఈ కాగితంపై ఇంకా.. ‘ముక్కలు ముక్కలైన నా బాడీ(శరీరం)ని నా వాళ్లకు అందజేయండి. నా పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇందులో (పజిల్) ఉన్నాయి. కనుక్కోండి...’ అని ఉంది. ఈ పజిల్ ఆధారంగాసెల్ నంబర్(9313516443)ను పోలీసులు గుర్తించారు. ఢిల్లీ అడ్రస్‌తో ఉన్న ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. మృతదేహన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. ఈ యువకుని వివరాలు తెలిసిన వారు ఖమ్మం జీఆర్‌పీ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రవిరాజు కోరారు.