
కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశా
మద్దతుపై యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్
► సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చాం.. అందుబాటులోకి రాలేదు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోరడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. ఫోనులో అందుబాటులోకి రాలేదు. మాట్లాడుతామని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం కూడా పెట్టినాము’అని రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులతో కలసి సోమవారం ఆమె గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.‘నేను లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైంది. ఆ సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉండటం ఒక చారిత్రక ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అలాంటి తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నాకు మద్దతు ఇవ్వాలి’ అని మీరాకుమార్ విజ్ఞప్తి చేశారు.
విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు...
రాష్ట్రపతిఎన్నికలో తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన 17 ప్రతిపక్ష పార్టీలకు మీరాకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్న దృక్పథాలున్న వేర్వేరు పార్టీలు సిద్ధాంతాల పరిరక్షణకోసం ఏకమై తనకు మద్దతు ఇస్తున్నాయన్నారు. తాను పర్యటించిన అన్ని రాష్ట్రాల్లో విశేషాదరణ వస్తోందన్నారు.
‘నేను బలిపశువును, బకరాను కాను. నేను ఒంటరిని కాను, సిద్ధాంతాలకోసం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకముంది. నాకు మద్దతును ఇవ్వాలని ఎంఐఎంను కూడా కోరుతా. టీఆర్‌ఎస్‌కు, ఎంఐఎంకు లేఖలు రాస్తా. మై బిహార్ కీ బేటీ హూ.. మగర్ దేశ్ హమారా హై(నేను బిహార్ బిడ్డనే. కానీ దేశమంతా మనదే)’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారం రోజులే చాలా ఎక్కువ అని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండువారాల సమయం ఉందని.. ఏమైనా జరగవచ్చని పేర్కొన్నారు.
అధికార పక్షం నుంచీ మద్దతిస్తారు..
అధికార బీజేపీలో ఉన్న చాలామంది తనకు మద్దతు ఇస్తారని మీరా ధీమా వ్యక్తం చేశారు. ‘అధికార పార్టీల సభ్యుల ఓట్లు పొందడానికి మా వ్యూహాలు మాకున్నాయి. మాకు మద్దతు ఇస్తున్న అందరి పేర్లు బయటకు చెప్పలేము కదా’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీకాదన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని స్పష్టంచేశారు. దేశంలో లౌకిక వాదానికి విఘాతం కలిగించే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజలు ఏంతినాలో, ఏం తినకూడదో ప్రభుత్వమే చెప్పడం ప్రమాదకరమన్నారు.
కేసీఆర్.. మనసు మార్చుకో: ఉత్తమ్
ముస్లింలు, క్రైస్తవులు దేశంలో పరాయివారని వ్యాఖ్యానించిన రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఎలా ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మనసు మార్చుకుని, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాతృ హృదయంతో వ్యవహరించా..
తెలంగాణ బిల్లుపై మీరాకుమార్
లోక్‌సభలో తెలంగాణ బిల్లు వచ్చిన సమయంలో మాతృహృదయంతో వ్యవహరించానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన మీరా కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్యులు, వివిధ మీడియా సంస్థల సంపాదకులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, ఆత్మగౌరవంకోసం స్వరాష్ట్ర కాంక్షతో తెలంగాణ యువత ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుంటే ద్రవించిపోయానన్నారు. చారి త్రక సమయంలో తెలంగాణ ఏర్పాటుకు పనిచేసిన సంతృప్తి ఉందన్నారు. తనకు తెలంగాణతో ఎంతో అనుబంధముందన్నారు. హైదరాబాద్‌తో తనది రెండు తరాల అనుబంధమన్నారు. కాగా, కాంగ్రెస్ నేతలతో కలసి తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపంవద్ద మీరాకుమార్ నివాళులు అర్పించారు.