విపక్షాల అభ్యర్థి మీరాకుమార్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించిన ప్రతిపక్షాలు
► 17 పార్టీల భేటీలో ఏకగ్రీవ నిర్ణయం
► మీరాకుమార్‌కు మాయావతి మద్దతు
► ఫలించని లాలూ దౌత్యం.. కోవింద్‌కు మద్దతుపై వెనక్కి తగ్గని జేడీయూ
► మీరాకుమార్‌ను బలిపశువును చేశారు: బీజేపీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సంగ్రామంలో ఎన్డీఏ దళిత బాణానికి ప్రతిపక్షాలు అదే స్థాయిలో బదులిచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీకి దళిత వర్గానికే చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్(72)ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కోవింద్ కూడా దళిత వర్గ నేత కావడంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు దళిత నేతల మధ్య పోరుగా మారింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో గురువారం జరిగిన భేటీలో 17 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ ఎంపికతో కొంత విజయం సాధించినా.. అసలు లక్ష్యమైన నితీశ్‌కుమార్ మద్దతు దక్కకపోవ డంతో డీలాపడ్డాయి. అయితే మీరాకు బీఎస్పీ మద్దతు ప్రకటించడం కొంత ఉపశమనం. మీరాకుమార్‌ను కాంగ్రెస్ బలిపశువు చేస్తోందని బీజేపీ విమర్శించింది.
విపక్షాల భేటీ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్‌ను బరిలోకి దించాలని 17 ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించార’ని పేర్కొన్నారు. నితీశ్ మద్దతుపై స్పందిస్తూ.. ‘ఇతర పార్టీలు కూడా మాతో కలుస్తాయనే ఆశాభావంతో ఉన్నామని, ఎవరి విషయంలోను నిరాశచెందమ’ని సమాధానమిచ్చారు. మీరాకుమార్ పేరుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.
షిండే, ముంగేకర్, గాంధీ, అంబేడ్కర్ల పేర్లపై చర్చ
సమావేశం ప్రారంభంలో సోనియా మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మీరాకుమార్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు దళిత నేతలైన మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాజ్యసభ ఎంపీ బాలచంద్ర ముంగేకర్ పేర్లను ప్రతిపాదించారు. ఎక్కువ పార్టీలు మీరాకుమార్ ఎంపికకు మొగ్గుచూపడంతో ఆమె పేరును సోనియా ఖరారు చేశారు.
మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పేర్లను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించినా ఆ పేర్లపై ఏకాభిప్రాయం రాలేదు. సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, సీపీఐ నాయకుడు డి.రాజా, డీఎంకే నుంచి కనిమొళి, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మీరాకుమార్‌కు మద్దతు పలికారు.
మద్దతు మాత్రమే.. ఎన్డీఏతో కలవం: జేడీయూ
ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు నిర్ణయాన్ని మార్చుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కోరతానని భేటీ అనంతరం ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో విభేదాలతో ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణానికి ముప్పు లేదన్నారు. అయితే లాలూ విజ్ఞప్తిని జేడీయూ తిరస్కరించింది. కోవింద్‌కు మద్దతిచ్చినంత మాత్రానా.. ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదని జేడీయూ నేత త్యాగి పేర్కొన్నారు.
అప్పుడు మీరాకుమార్ గుర్తుకు రాలేదా: బీజేపీ
మీరాకుమార్‌ను బలిపశువు చేశారని బీజేపీ పేర్కొంది. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా దళిత నేతను రాష్ట్రప తిగా ఎన్నికునే అవకాశమున్నా.. అప్పుడు తగిన వ్యక్తిగా మీరాకుమార్‌ను గుర్తించలేదు. ఇప్పుడు ఓటమి తప్పదని తెలియడంతో ఆమెను రంగంలోకి దింపార’ని బీజేపీ ప్రతినిధి నరసింహ రావు పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకోండి: మీరాకుమార్
న్యూఢిల్లీ: అత్యున్నత విలువలు, సామాజిక న్యాయం, సిద్ధాంతాలు, సైద్ధాంతిక భావజాలం ఆధారంగా విశాల దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలని మీరాకుమార్ కోరారు. తనను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రతిపక్ష పార్టీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యత తనకు సంతోషం కలిగించిందన్నారు.
ఐఎఫ్‌ఎస్ నుంచి స్పీకర్ వరకు..
⇒ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేయక ముందు నుంచే ప్రముఖ దళిత నేత జగ్జీవన్‌రాం కుమార్తెగా మీరాకుమార్ సుపరిచితమే..
⇒ జననం: మార్చి 31, 1945న బిహార్‌లోని అర్రాహ్ జిల్లాలో
⇒ తల్లిదండ్రులు: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం, స్వాతంత్య్ర సమరయోధురాలు ఇంద్రాణీదేవి
⇒ కుటుంబం: భర్త మంజుల్ కుమార్.. ఆయన కూడా ఐఎఫ్‌ఎస్ అధికారే.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
⇒ విద్యాభ్యాసం: బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ(ఇంగ్లిష్), అడ్వాన్స్‌డ్ డిప్లమో ఇన్ స్పానిష్, బనస్థలి విద్యాపీఠ్ నుంచి గౌరవ డాక్టరేట్
⇒ దౌత్యవేత్తగా: 1973లో ఐఎఫ్‌ఎస్‌లో చేరిక. బ్రిటన్, స్పెయిన్, మారిషస్‌లో దౌత్యవేత్తగా బాధ్యతల నిర్వహణ. ఐరాసలోని వివిధ భారతీయ మిషన్లలో కూడా పనిచేశారు.
⇒ రాజకీయ ప్రస్థానం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఐఎఫ్‌ఎస్‌కు రాజీనామా.. 1985లో తొలిసారి యూపీలోని బిజ్నోర్ నుంచి ఎన్నిక. అనంతరం బిహార్‌లోని తండ్రి నియోజకవర్గం సాసారాం నుంచి 1989, 91లో ఓటమి. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని కరోల్‌బాగ్ నుంచి గెలుపు.. అనంతరం 1999 ఎన్డీఏ ప్రభజనంలో ఓటమి. 2004, 2009లో సాసారాం నుంచి గెలుపు. ప్రముఖ దళిత నేతలైన రాంవిలాస్ పాశ్వాన్, మాయావతిని ఆమె ఓడించారు.
⇒ కేంద్ర మంత్రిగా: 2004–2009 వరకూ సాంఘిక న్యాయం, సాధికారికత మంత్రిగా, 2009లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ.
⇒ 2009 నుంచి 2014 వరకూ 15వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.