సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ఈ ఏడాది లోటు వర్షపాతం కారణంగా చిన్న నీటి వనరులైన చెరువుల కింద తెలంగాణలో నీటి వినియోగం తగ్గింది. చెరువుల కింద 89 టీఎంసీల కేటాయింపులున్నా 19.30 టీఎంసీల నీటినే రాష్ట్రం వినియోగించుకోగలిగింది. గతానికి భిన్నంగా నీటి వినియోగం తగ్గడం రాష్ట్రాన్ని కలవర పరుస్తుండగా, మరోవైపు ఈ లెక్కలను ఏపీ తప్పుపడుతుండటం వివాదాలకు తావిస్తోంది. నిజానికి కృష్ణా బేసిన్‌లో చెరువుల కింద 89 టీఎంసీల కేటాయింపులున్నా, చిన్న నీటి వనరుల సగటు వినియోగం 1998 నుంచి 2008 వరకు 47.7 టీఎంసీలు మాత్రమే . ఇక 2006 నుంచి 2015 వరకు చూస్తే ఇది 46.97 టీఎంసీలుంది. ఈ ఏడాది మాత్రం సాధారణ వర్ష పాతం 769 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉన్నా ఈ నెల 10 వరకు 665.5 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది.
62శాతం మండలాల్లో 59 నుంచి 20శాతం లోటు నమోదు కాగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో చెరువుల్లో 19.30 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. దీంతో జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపారు. కాగా రాష్ట్రంలో చెరువుల వినియోగం అధికంగా ఉంటోందని, దాన్ని పరిగణనలోకి తీసుకొనే నీటి వాటాలు, కేటాయింపులు చేయాలని ఏపీ వాదిస్తోంది. మంగళవారం జరగనున్న కృష్ణా బోర్డు భేటీలో దీనిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రం తన వాద నలు సిద్ధం చేసుకుంది. దీనికి తోడు శ్రీశైలం నుంచి ఇష్టారీతిన ఏపీ చేస్తున్న నీటి వినియోగాన్ని బోర్డు ముందు పెట్టాలని నిర్ణయించింది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా శ్రీశైలం నీటిని ఏపీ వాడేస్తుండటంతో త్వరలోనే శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు నిల్వలు పడి పోయే ఆస్కారం ఉందని ప్రస్తావించనుంది. ఇదీగాక వచ్చే మే వరకు సాగర్‌లో కనీస నీటి మట్టాలను 520 అడుగులు ఉంచాల్సిన అవస రం ఉందనీ, అలా అయితేనే ఆగస్టు వరకు ఇరు రాష్ట్రాలకు అవసరమయ్యే 21 టీఎంసీల తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ భావన. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగంపై ఏపీని నియంత్రించాలని తెలంగాణ కృష్ణాబోర్డును కోరే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.
కృష్ణా బేసిన్‌లో చెరువుల నీటి వినియోగం తక్కువే
Published Mon, Oct 15 2018 2:01 AM | Last Updated on Mon, Oct 15 2018 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment