సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆలస్యం చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నేతలు సూచించారు. నామినేషన్ గడువు ముగిసే రెండు, మూడు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందని వివరించారు. ఇబ్బందులు లేని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వీలైనంత ముందే ఖరారు చేయాలని కోరారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు చిన్నారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత మేనిఫె స్టోను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామనే విషయాన్ని వివరించామన్నారు. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల ఆలస్యం వల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే ఐదు ప్రధాన హామీలను నిర్దేశించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు.
రైతు రుణమాఫీతోపాటు పంట బీమా కూడా ప్రకటించాలని కోరామన్నారు. పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా నిబంధనలను రూపొందించి మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పామన్నారు. మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆకర్షణీయ పథకాలను పొందుపరచాలని సూచించినట్లు పేర్కొ న్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా ఆ ఒప్పందాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉండదని చెప్పారు. దీనిపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రస్తావించిన విషయం సరైందేనన్నారు.
జన్మ ధన్యమైంది: సంపత్
సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలోకి ప్రవేశించిన రాహుల్‌కు సంపత్‌కుమార్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యత్వ అనర్హత కేసు ఏమైందని అడిగారని సంపత్ చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను సీడబ్ల్యూసీ సమావేశానికి ఆహ్వానించడం, ఆ సమావేశంలో తాను పాల్గొనడం ఊహించలేదని, తన జన్మ ధన్యమైందని సంపత్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రాహుల్‌కు చెప్పానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment