'అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆరోపించారు. పదవులనుభవించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ పార్టీలో మరో బీసీ నేతను తయారు చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫొటోలు గాంధీభవన్లో ఉండటానికి అనుమతి లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ అవినీతి, ఓటుకు కోట్లు అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని వీహెచ్ స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 20 వరకు జిల్లాల్లో ధర్నా నిర్వహించాలని పీసీసీని కోరినట్లు వీహెచ్ తెలిపారు. అంతకుముందు గాంధీభవన్ మీడియా హాల్ నుంచి పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్, కేకే, బొత్స సత్యనారాయణ ఫొటోలను వీహెచ్, మాజీ మంత్రి ఆర్ దామోదరరెడ్డి తొలగించారు.