సెలవు రోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్‌లు? | Vacation days in the driving license? | Sakshi
Sakshi News home page

సెలవు రోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్‌లు?

Published Sun, Jan 18 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

Vacation days in the driving license?

సాక్షి, సిటీబ్యూరో: సెలవు రోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్‌లు జారీ చేసేందుకు ఆర్టీఏ కసరత్తు చేస్తోంది. తద్వారా ఉద్యోగులు, నిత్యం బిజీగా ఉండేవారికి ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఉద్యోగులు డ్రైవింగ్ లెసైన్సు తీసుకోవాలంటే రెండు సార్లు ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ పైఅధికారుల అనుమతి తీసుకొని గంట, రెండు గంటల్లో ఆ  ప్రక్రియను ముగించుకోవాలనుకొంటే ఏ మాత్రం సాధ్యం కాదు. ఖచ్చితంగా సెలవుపెట్టాల్సిందే. ఈకారణంగా చాలామంది సకాలంలో  డ్రైవింగ్ లెసైన్సులు తీసుకోలేకపోతున్నారు.

కొత్త వాహనం కొనుక్కొని నెలలు గడిచినప్పటికీ  తీరిక లభించని కారణంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా  తిరిగే వాళ్లు కూడా ఉన్నారు. వాహనదారులు ఎదుర్కొంటున్న  ఇలాంటి  ఇబ్బందులను అధిగమించేందుకు  రవాణాశాఖ సెలవురోజుల్లోనూ డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రవాణా  కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఇదే అంశాన్ని  శనివారం  అధికారుల ముందు ప్రతిపాదించారు.

సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. దీంతో  రవాణాశాఖ ఉన్నతాధికారులు సెలవుల్లోనూ  డ్రైవింగ్ లెసైన్సులు, ఇతర పౌరసేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అంశంపై సన్నాహాలు  మొదలెట్టారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే నగరంలోని  వేలాది మంది  ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, వివిధ రంగాల్లో పని చేసే  వాహనదారులకు  ఎంతో ప్రయోజనకరమవుతుంది.
 
భర్తీ కాకుండా మిగిలిపోతున్న స్లాట్‌లు....
డ్రైవింగ్ లెసైన్సుల జారీలో ఆర్టీఏ కొంతకాలంగా  ఆన్‌లైన్ సేవలను అమలు చేస్తోంది. వాహనదారులు  మొదట లెర్నింగ్ లెసైన్సు తీసుకొని ఆ తరువాత ఆరు నెలల్లోపు  ఎప్పుడైనా సరే  డ్రైవింగ్ లెసైన్సు తీసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లై న్‌లో లెర్నింగ్ లెసైన్సు కోసం ఒకసారి, శాశ్వత డ్రైవింగ్ లెసైన్సు కోసం మరోసారి  స్లాట్ నమోదు చేసుకోవలసి ఉంటుంది.

అలా నమోదు చేసుకొన్నవాళ్లకు  గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో, నాలుగు డ్రైవింగ్‌టెస్ట్ ట్రాక్‌లలో  పరీక్షలు నిర్వహించి  లెసైన్సులు అందజేస్తారు.  ఈ రెండు కేటగిరీలలో ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది పరీక్షలకు హాజరవుతారు. అయినప్పటికీ  పలు  ఆర్టీఏ  కార్యాలయాల్లో  స్లాట్‌లు  పూర్తిగా భర్తీ కావడం లేదు. కొన్ని మిగిలిపోతున్నాయి.అంటే ఉద్యోగరీత్యా తీరిక లేకపోవడం వల్ల చాలా మంది స్లాట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోతున్నారు.

వీకెండ్స్‌లో,రెండో శనివారం, ఆదివారం వంటి సెలవు దినాల్లో కూడా ఆర్టీఏ పౌరసేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం వల్ల  చాలా మంది సకాలంలో డ్రైవింగ్ లెసైన్సులు తీసుకోగలుతారని, వాహనాల రిజిస్ట్రేషన్‌లు కూడా పెరుగుతాయని  రవాణా కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం  నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఎంవీఐలు, ఆర్టీఓలు, ఇతర సిబ్బందితో సమాలోచనలు జరపాల్సిందిగా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. సెలవు రోజుల్లో పని చేసే  వారు ఇతర పనిదినాల్లో వీక్లీ ఆఫ్  తీసుకొనే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement