లెఫ్ట్‌ టు రైట్‌కు ‘టెస్ట్‌’..! | we will follow Hyderabad traffic rules | Sakshi
Sakshi News home page

లెఫ్ట్‌ టు రైట్‌కు ‘టెస్ట్‌’..!

Published Thu, Aug 17 2017 2:48 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

లెఫ్ట్‌ టు రైట్‌కు ‘టెస్ట్‌’..! - Sakshi

లెఫ్ట్‌ టు రైట్‌కు ‘టెస్ట్‌’..!

  • ఎడమ నుంచి కుడికి మారాలంటే పరీక్ష పాసవ్వాల్సిందే
  •  కనీస శిక్షణ ఉంటేనే విదేశీ డ్రైవింగ్‌ లైసెన్సుల మార్పిడి
  •  హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై అవగాహన ఉండాలంటున్న నిపుణులు
  •  ప్రస్తుతం డేటా ఆధారంగానే లైసెన్సుల బదిలీ
  •  లైసెన్స్‌ బదిలీ విధానంలో మార్పులకు ఆర్టీఏ సన్నాహాలు
  • సాక్షి, హైదరాబాద్‌: అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చేశారా..? ఆ దేశంలో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్సును ఇక్కడికి బదిలీ చేసుకోవా లని అనుకుంటున్నారా..? అయితే మీరు కొంతకాలం డ్రైవింగ్‌లో శిక్షణ పొందాల్సిందే. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నిబంధనలకు అనుగు ణంగా వాహనం నడిపే నైపుణ్యం సాధిస్తేనే మీ డ్రైవింగ్‌ లైసెన్సు బదిలీ అవుతుంది. అమెరికా యే కాదు.. ఏ విదేశీ డ్రైవింగ్‌ లైసెన్సు అయినా మార్చుకోవాలంటే డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరు కావలసిందే. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో పొందిన డ్రైవింగ్‌ లైసెన్సుల ఆధారంగా ఇక్కడ కొత్తగా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంలో మార్పులు అవసరమని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు.

    లెఫ్ట్‌ టూ రైట్‌ కోసం..
    విదేశాల్లో ఎక్కువ శాతం ఎడమ వైపు స్టీరింగ్‌ ఉంటుంది. అక్కడ వాహనాలు నడిపే వాళ్లంతా ఎడమవైపు డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవాళ్లు. పైగా అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లోని ట్రాఫిక్‌ నిబంధనలకు, మన నిబంధనలకు ఎంతో తేడా ఉంటుంది. రోడ్డు నిర్మాణంలోనూ మార్పులుంటాయి. హైదరా బాద్‌లో ట్రాఫిక్‌ ఎక్కువ. మన రోడ్లపై 18 నుంచి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లడం సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లన్నీ కుడివైపు డ్రైవింగ్‌కు అనుగుణమైన నిబంధనలతో ఉన్నాయి. అయితే ఈ మార్పులను పరిగణన లోకి తీసుకోకుండా అమెరికా లైసెన్సు కలిగి ఉన్నవాళ్లకు ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ లైసెన్సు ఇచ్చేస్తున్నారు. స్పీడ్‌పై నియంత్రణ లేకపోవడం.. ట్రాఫిక్‌ రద్దీ తదితర కారణాలతో వాహనదారులు తరచు అదుపు కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్‌ నిబంధనలు, ఎడమ నుంచి కుడికి స్టీరింగ్‌ మార్పుపై కొంత శిక్షణ అవసరమని నిఫుణులు భావిస్తున్నారు. లైసెన్సు మార్చుకునేందుకు వచ్చేవారికి ఆర్టీఏ డ్రైవింగ్‌ ట్రాక్‌ల్లో పరీక్షలు నిర్వహించి లైసెన్సులిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    అనువాదం ఉండాలి..
    విదేశాల్లో తీసుకునే డ్రైవింగ్‌ లైసెన్సులు ఎక్కువ శాతం ఇంగ్లిష్‌లోనే ఉన్నప్పటికీ.. సౌదీ అరేబియా, దుబాయ్‌ తదితర దేశాల డ్రైవింగ్‌ లైసెన్సులు అరబిక్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ఇలాంటి లైసెన్సుల్లో డేటాను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసుకుని ఆర్టీఏలో సమర్పించాలి. వీటిని ఇఫ్లూ యూనివర్సిటీలోనూ, ఇతర అధికారిక అనువాదకుల వద్ద ట్రాన్స్‌లేట్‌ చేసుకోవలసి ఉంటుంది. మన డ్రైవింగ్‌ లైసెన్సుల్లో ‘ఎంసీ (మోటార్‌ సైకిల్‌), ఎల్‌ఎంవీ(లైట్‌ మోటార్‌ వెహికల్‌) వంటి పదాలు ఉంటాయి. విదేశీ లైసెన్సుల్లో ‘ఎ,’‘బి’, ‘సి’, ‘డి’వంటి అక్షరాలు ఉంటాయి. ఏ అక్షరం ఏ వాహనానికి సంకేతం అనేది ఆయా దేశాల్లోని రవాణా కార్యాలయాల్లో మాత్రమే నమోదై ఉంటుంది. డేటా మార్పిడిలో ఇలాంటి సాంకేతిక పదజాలం కూడా మారుతుంది.

    అలాగే విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్సుకు కాలపరిమితి ఎంత వరకు ఉంటే అంతవరకే ఇక్కడ ఇస్తారు. ‘‘మనం ఇచ్చే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్లను(ఐడీపీ) కొన్ని దేశాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఇది ఒక డాక్యుమెంట్‌గానే నమోదై ఉంది. కానీ డ్రైవింగ్‌ లైసెన్సుగా కాదు. హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ చేసిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వాహనం నడపగలరు. కానీ విదేశాల్లో డ్రైవింగ్‌ అనుభవం ఉన్నవాళ్లు ఇక్కడ నడపాలంటే కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’’అని ఆర్టీఏ అధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు.

    ఏటా వందల్లో మార్పులు..
    ప్రస్తుతం విదేశాల్లో పొందిన డ్రైవింగ్‌ లైసెన్సు కాలపరిమితికి అనుగు ణంగా ఎలాంటి టెస్టులు లేకుండానే ఇక్కడ లైసెన్సులు ఇస్తున్నారు. ఇందు కోసం వాహనదారులు హైదరాబాద్‌లో తమ శాశ్వత చిరునామా ధ్రువీకరణ, విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్సు డేటాను అందజేయాలి. ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకుని రూ.750 ఫీజు చెల్లించి.. నిర్ణీత తేదీ, సమయంలో ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే.. విదేశాల్లో తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్సు డేటాను హైదరాబాద్‌ ఆర్టీఏకు మార్చుకుని కొత్త లైసెన్సు ఇస్తారు. అమెరికా, సింగపూర్, బ్రిటన్, దుబాయ్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ఈ తరహా లైసెన్సుల బదిలీ కోసం ఏటా వందలాది మంది వస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement