
1993లో హరిచరణ్ మార్వాడి స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌లో..
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్)/ఆర్మూర్ : దివంగతులైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి జిల్లాతో అనుబంధం ఉంది. మూడు పర్యాయాలు ఆయన జిల్లాకు వచ్చారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని, జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ.. ఇలా వివిధ పార్టీలు, పదవులు, హోదాల్లో జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా బీజేపీ నేతలు స్మరించుకుంటున్నారు. జిల్లాలో 1971లో సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జనసంఘ్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ మోహన్‌రెడ్డి భీంగల్ సమితి ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. విషయం తెలుసుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయి జిల్లా కేంద్రానికి వచ్చి పబ్లిక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
వాజ్‌పేయి అప్పటికే ఐదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి 1980లో రెండోసారి జిల్లాకు వచ్చారు. జనతాపార్టీ తరపున ఎంపీగా గెలిచిన ఆయన మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగించారు. ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూలమైన అంశాలను సభలో వివరించారు.1993లో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో భారత పరిక్రమణ యాత్రలో భాగంగా వాజ్‌పేయి జిల్లా పర్యటించారు.
ఉదయం బాల్కొండలో బహిరంగ సభ నిర్వహించారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడీ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అప్పుడు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వాజ్‌పేయి ఆర్మూర్‌లోని ఐబీ గెస్ట్ హౌజ్ (ప్రస్తుత పోలీస్ స్టేషన్ భవనం)లో రాత్రి బస చేసారు.
రాత్రి భోజనాలతో పాటు ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పుప్పాల శివరాజ్ తదితర నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దేశానికి నిస్వార్థంగా సేవలందించిన వాజ్‌పేయి మరణం పార్టీకే కాదు యావత్ దేశానికే తీరని లోటని బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కొండా ఆశన్న సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment