ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు.
- మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి వీరస్వామి, కోటయ్య మృతి
- ఆపన్నహస్తం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపు
రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి. ఎవుసం చేద్దామంటే సెంటు భూమి లేదు. ఊరిలో ఉపాధి లేక.. బతుకుదారి చూపేవారు లేక పొట్టచేతపట్టుకుని పట్నం పోయిన ఆ కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయాయి. ఈనెల 1వ తేదీన హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో వెళ్లిన వలసకూలీలు చాకలికోటయ్య, వీరస్వామి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఏ దిక్కూలేక వారి భార్యాపిల్లలు రోడ్డునపడ్డారు. నాగర్‌కర్నూల్ మండలం ఉయ్యలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(35) గ్రామంలో సెంటు భూమి కూడా లేదు. తన భార్య మంగమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు, కొడుకును తీసుకొని ఆరేళ్లక్రితం హైదరాబాద్‌కు వలసవెళ్లారు.
అక్కడే రాంకోటి ప్రాంతంలో ఉన్న ఆర్‌కే ఎస్టేట్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు కల్పనను 9వ తరగతి, అఖిల 6వ తరగతి, వంశీ 6వ తరగతి చదివిస్తున్నాడు. భార్య ఇళ్లల్లో పనులకు వెళ్తూ, తానూ అప్పుడప్పుడు అడ్డాకూలీగా పనులకు వెళ్లేవాడు. ఈక్రమంలో మే డే రోజున మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో పనికి వెళ్లాడు. మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువుకు గురై చనిపోయాడు. ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడింది. తన కూతుళ్లను కస్తూర్బా స్కూల్లో, కొడుకును ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని మంగమ్మ వేడుకుంటోంది.
వీరస్వామి కుటుంబం కన్నీటిగాథ
మరో వలసకూలీది అదే కన్నీటి వ్యథ.. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ బొందయ్య, బాలకిష్టమ్మ పెద్దకొడుకు వీరస్వామి(33) బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం హైదారాబాద్‌కు వలసవెళ్లాడు. ప్రస్తుతం రాంకోటి ప్రాంతంలో చిన్నపాటి గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. భార్య భాగ్యలక్ష్మితో కలిసి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన వీరస్వామి విషవాయులతో ఊపిరాడక చనిపోయాడు. అతడికి ఇద్దరు కొడుకులు లాలు, శివ ఉన్నారు. వీరస్వామికి గ్రామంలో సొంతిళ్లు కూడా లేదు. కేవలం బేస్‌మెంట్ వరకే నిర్మించి వదిలివేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ సుల్తానమ్మ, ఎంపీటీసీలు ఎల్లమ్మ, మాధవి కోరారు. వీరస్వామి అంత్యక్రియలు సోమవారం రాత్రి స్వగ్రామంలోనే నిర్వహించారు.