వెజిట్రబుల్‌! | Vegetable Markets Shortage in Hyderabad | Sakshi
Sakshi News home page

వెజిట్రబుల్‌!

Aug 19 2019 11:03 AM | Updated on Aug 31 2019 12:16 PM

Vegetable Markets Shortage in Hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో: నగర జనాభా కోటిదాటింది. ఇంతమందికి సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్ల కోసం తగినన్ని మార్కెట్లు అవసరం. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో కనీసం 50 మార్కెట్లు ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. పోనీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున అనుకున్నా 27 ఉండాలి. కానీ గ్రేటర్‌లో కేవలం11 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నగరవాసులు 5–6 కిలోమీటర్లు ప్రయాణించి, 3–4గంటల సమయం వెచ్చించి రైతు బజార్లలో కూరగాయలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు గిట్టుబాటు ధర, సిటీజనులకు తాజా కూరగాయలు  అందించాలనే సంకల్పంతో 1999లో రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేయగా... జనాభా అంతకంతకూ పెరగగా, రైతు బజార్లను మాత్రం పెంచలేదు. మార్కెటింగ్‌ శాఖ కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ నగరంలో ఖాళీ స్థలం దొరకడం లేదు. కనీసం ఎకరం స్థలం ఉంటేనే రైతు బజార్‌ ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ పేర్కొంటోంది. నగరంతో పాటు శివార్లలో చాలా ప్రాంతాల్లో ఎకరం కంటే తక్కువ స్థలాలున్నా వాటిని ఉపయోగించుకోవడం లేదు. 

మో‘డల్‌’ మార్కెట్లు..  
రైతుబజార్లు ఏర్పాటు చేసినప్పుడు గ్రేటర్‌ జనాభా 40 లక్షలు. ఇప్పుడు కోటి దాటింది. జాతీయ పోషకాహార సంస్థ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ 300 గ్రాముల తాజా కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఈ లెక్కన కోటి మందికి 3వేల టన్నుల కూరగాయలు అవసరం. ఆ మధ్య ప్రారంభించిన మేడిపల్లి, ఎల్లమ్మబండ రైతుబజార్లతో కలిపితే మొ త్తం 11 రైతుబజార్లు ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ప్రతి 10వేల మందికి ఒక మార్కెట్‌ ఉండాలని... నగర వ్యాప్తంగా మోడ ల్‌ మార్కెట్‌లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 

ఇప్పటికీ తూకమే...  
ఇప్పుడంతా డిజిటల్‌ యుగం. కానీ మార్కెటింగ్‌ శాఖ పరిధిలో ఇంకా తరాజు సిస్టమ్‌ కొనసాగుతోంది. ఇదే అదనుగా కొన్ని మార్కెట్‌లలో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చే కూరగాయల ఆధారంగా మార్కెటింగ్‌ శాఖ «అధికారులు రోజూ ధరలు నిర్ణయిస్తారు. ఆ ధరలకు అనుగుణంగానే రైతుబజార్లలో విక్రయాలు జరగాలి. కానీ అలా ఎప్పుడూ జరగడం లేదు. రైతుబజార్‌ బోర్డుపై రాసిన ధరలకు, అమ్మే ధరలకు పొంతన ఉండడం లేదు. రైతుబజార్లలో ధరలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వినియోగదారుల నుంచి నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రైతుబజార్‌లలో అరకిలో కంటే తక్కువ విక్రయించరు. ఒకవేళ అడిగినా తూకాలు లేవని చెబుతారు. డిజిటల్‌ తూకాలు ఉంటే ఈ సమస్య ఉండదు. 

దళారుల దందా...  
నగరంలోని దాదాపు అన్ని రైతుబజార్లలో రైతులు నామమాత్రంగానే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఏడాది పాటు దళారుల పెత్తనమే సాగుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులకు స్థలాలు లేక రైతుబజార్ల బయట విక్రయాలు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని రైతుబజార్లలో 150–250 వరకు షాపులు ఉన్నాయి. ఒక్కో బజారులో సాధారణ రోజుల్లో 1,500–2,000 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని మార్కెటింగ్‌ శాఖ అధికారుల అంచనా. ఇక పెద్ద రైతుబజార్లయిన ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, మెహిదీపట్నం మార్కెట్లలో రోజూ 3,500 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక్కో రైతుబజార్‌ÆŠకు రోజూ 10వేల మంది వస్తారు. దాదాపు రోజుకు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారాల్లో అయితే 25వేల మంది వస్తారని.. రూ.50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ విక్రయాలన్నీ రైతుల పేర్లతో జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి విక్రయించేది మాత్రం దళారులు. దీంతో ఇంత మొత్తంలో వ్యాపారాలు జరుగుతున్నా వాణిజ్య పన్ను ఎవరూ చెల్లించడం లేదు.  

స్టాళ్ల సంఖ్య పెంపు
గ్రేటర్‌ పరిధిలో రైతుబజార్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలు లభించడం లేదు. రైతుబజార్ల ఏర్పాటు కోసం కనీసం ఎకరం అవసరం. కొత్తగా రైతుబజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేశాం. నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చాడాకి ‘మన కూరగాయలు’ స్టాళ్ల సంఖ్యను పెంచుతున్నాం.       – లక్ష్మిబాయి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement