సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్‌లో కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మే ప్రారంభంలో నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న కూరగాయల ధరలు మే నెల ప్రారంభంతోనే ఒకేసారి ధరలు భగ్గుమంటున్నాయి. మేలోనే ధరలు ఈ స్థాయిలో పెరిగితే ఇక వచ్చే జూన్ , జూలై నెలలో ధరలు ఆకాశాన్నంటనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. టమాటా తప్ప అన్ని రకాల కూరగాయలు ధరలు రైతు బజార్‌లతో పాటు బహిరంగ మార్కెట్‌లలో కిలో రూ. 60 దాటాయి. మార్కెటింగ్ శాఖ అధికారులు ధరల నియత్రించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ధరలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయని వినియోగదారలు చెబుతున్నారు.
గ్రేటర్‌కు రోజు 3 వేల టన్నులకూరగాయలు
గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటి మంది. వీరికి ప్రతి రోజూ దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు అవసరం. ప్రతి ఒక్కరూ 300 గ్రాములు వినియోగిస్తున్నారు. వేసవి ఆఫ్ సీజన్‌లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాలతో పూర్తి అవుతాయి. సీజన్‌లో స్థానికంగా కూరగాయల దిగుబడి ఎక్కువ ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం ఆఫ్‌సీజన్ కావడంతో కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు అవడంతో ధరలు రోజు రోజుకూ విపరితంగా పెరుగుతున్నాయి,
ఆఫ్ సీజన్ ఏజెంట్లకు పండగ
ఆఫ్ సీజన్‌లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండవు. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకు కొనాల్సి ఉంటుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయి.
నిల్వకు ప్రత్యామ్నాయం లేదు..
సీజన్‌లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అఫ్‌సీజన్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయల రేట్ల నిర్ధారణ లేదు. ఆఫ్ సీజన్‌లో మార్కెటింగ్ శాఖ ద్వారా కాకుండా ఏజెంట్లు రాష్ట్రంలో అందుబాటులో లేని కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తారు. ఏజెంట్లు నిర్ధారించిన ధరల్లోనే ఆఫ్ సీజన్‌లో కూరగాయలు అందుబాటులో ఉంటాయి.
నగర శివారు నుంచి తగ్గిన దిగుమతులు
ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ రైతులు కూరగాయలు పండించటంతో ఎక్కువ దిగుమతి అయ్యాయి. దీంతో కూరగాయల ధరలు మే వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతులు ఎక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా పెరగలేదు. దీంతో మే నెల కంటే ముందు వరకు కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు రైతుబజార్‌లలో ధరలు ఉన్నాయి.
మార్కెట్‌లో ధరలిలా..
టమోటా కిలో రూ. 40 వంకాయ రూ. 30, బెండ రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాకరకాయ రూ.50, బీర రూ.60, క్యాలిఫ్లవర్ రూ.50, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.40, దొండ రూ.40, ఆలుగడ్డ రూ.35, గోకర రూ.50, దోస రూ.40, సొరకాయ రూ.40, పొట్లకాయ రూ. 40, చిక్కుడు రూ.80, అర్వి రూ.50, చిలుకడ దుంప రూ.50, బీట్‌రూట్ రూ.30, కీర రూ.50, బీన్స్ రూ.80, క్యాప్సికమ్ రూ.40
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేదు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఏటా మే నుంచి జూలై వరకు «కూరగాయల ధరలు పెరుగురుతాయి. స్థానికంగా దిగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కావడంతో ధరల ప్రభావం ఉంటుంది.డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. – కే.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment