సాక్షి,వరంగల్ : వరంగల్‌లోని ఏవివి విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం ఉత్సవాలను భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యవసాయక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసిల్లింది. 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ.. ఇంత గొప్ప విద్యాసంస్థను స్థాపించిన చందా కాంతయ్యను మనమంతా గుర్తుంచుకోవాలి.
భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత్కు పెద్ద బలం. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి. అయితే దీనికి కావాల్సిందల్లా అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే. దేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నా' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ లక్ష్మికాంత రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment