
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో సేవలందిస్తున్న భారతీయ వైద్యులు తమను కన్న భూమి సేవకూ ముందుకు రావా లని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కర్మభూమి అయిన అమెరికాలో ఉండి అత్యుత్తమ సేవలందిస్తున్నారని వైద్యులను ప్రశంసిస్తూనే.. మాతృభూమి భారత్‌లోని గ్రామాలను దత్తత తీసుకుని సేవలందించడంపై దృష్టిసారించాలని వారికి సూచించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియిన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో ‘గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్–2019’ పేరుతో తాజ్‌కృష్ణా హోటల్‌లో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారత్‌లో యాంటీ బయోటిక్స్ నిరోధక వ్యవస్థ క్షీణించడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు భారత వైద్యులతో కలిసి అమెరికాలోని భారత సంతతి వైద్యులు పనిచేయాలని కోరారు.
అమెరికాకు వెళ్లి చదువుకోవడం అక్కడ పనిచేయడం తప్పుకాదని.. అలా చేస్తూనే మాతృ భూమికి కొంతైనా రుణం చెల్లించేందుకు ముందుకు రావా లన్నారు. ప్రపంచ వైద్య వ్యవస్థకు భారత్ దీపస్తంభమని శుశ్రుతుడు, చరకుడు వంటి వారు నిరూపించారన్నారు. చాలా దేశాల నుంచి భారత్‌కు వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. గతంతో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం 69 ఏళ్లకు పెరిగిందని, ఇదంతా వైద్యుల కృషి ఫలితమేనన్నారు. సామాజిక వైద్య బాధ్యతలతో ఆరోగ్య భారత్ లక్ష్యం సులువుగా సాధించవచ్చని అన్నారు. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరికి భారత వైద్యులే సేవలందిస్తున్నారని తెలిపారు. ఇదంతా నాణేనికి ఒకవైపేనని ఇంకా చాలాచోట్ల ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు లేవనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. గ్రామాల వరకు వైద్య సేవల విస్తరణకు ఒక్క ప్రభుత్వం పనిచేస్తేనే సరిపోదని, ప్రైవేటురంగం కూడా చొరవ చూపాలని అన్నారు.
సంస్కరణల వేగం...
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న ఉప రాష్ట్రపతి దేశంలో సంస్కరణలు వేగం పుంజుకున్నాయని తెలిపారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయం కాదని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ రేటింగ్ తదితర సంస్థలు చెబుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు చెందిన సావనీర్‌ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం ‘రేషికేషన్ కౌన్సిల్’వారు రూపొందించిన కాంప్రహెన్సివ్ కార్డియో లైఫ్ సపోర్ట్ (సీసీఎల్‌ఎస్) మాన్యువల్‌ను ఆవిష్కరించారు.
సింగిల్ విండో అనుమతులు: హర్షవర్ధన్
శాస్త్ర విజ్ఞాన రంగంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దేశంలో వైద్య సేవలు అందించాలనుకునే భారత సంతతి వైద్యులకు సింగిల్ విండో అనుమతులు ఇప్పిస్తామన్నారు. తెలంగాణలో చేపడుతున్న ఆరోగ్యశ్రీ, కంటివెలుగు, హరితహారం వంటి పథకాలను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సదస్సులో వివరించారు. ఈ కార్యక్రమంలో అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ‘ఆపి’అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు, నోరి దత్తాత్రేయుడు, అమెరికాలో భారత సంతతి వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొత్త ఏఏపీఐ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment