సాహు దంపతులు (ఫైల్)
వరంగల్, భీమదేవరపల్లి(హుస్నాబాద్) : బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం.. గొండు బిడ్డల దీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం...ఆయన జీవితమనే నాణానికి బొమ్మబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏకకాలంలో రచయితగా, ఉద్యకారుడిగా విశేష గుర్తింపు పొందిన ఈ సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దుబిడ్డ. ఆ గ్రామ ప్రజలు ముద్దుగా వెంకన్న అని పిలుచుకునే ఆయన అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు అలియాస్ సాహు. నేడు ప్రజా కవి కామ్రెడ్ సాహు 63వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
‘నీ కన్నీరు నా కన్నీరు కలిగినోడికి పన్నీరాఝె ఒంటిగా ఓ శోకం పెట్టె చిన్ని తమ్మయ్య నీ జంటగా నేనుంటరారా చిన్ని తమ్మయ్యా...’ అంటూ బాల కార్మికుల గాధలను సమాజానికి తెలియపర్చి వారి న్యాయం కోసం పోరాడిన ఘనత సాహుదే. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆయన తప్పకుండా ఉంటాడు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, సాహిత్య ప్రపంచమూ కావచ్చు...ఆయన ఆలోచన, ఆచరణ, సామాజాన్ని తట్టి లేపే శక్తి అమోఘం. అన్ని ఉద్యమాల్లో ఆయన ఓ పోరాట యోధుడు, విరామమెరుగని యుద్ద సైనికుడు...ఆయనే ప్రజా కవి కామ్రెడ్ సాహు... ఓ వైపు ఉద్యమయోధుడిగా మరో వైపు సాహితి వేత్తగా ఏకకాలంలో రాణించి సమాజానికి దిక్చూచిలా నిలిచాడు సాహు. లిపి లేని గొండు భాషకు లిపిని సృష్టించి కొమురంభీం జీవిత చరిత్రను వెలికి (అల్లం రాజయ్యతో కలిసి) తీసి బాహ్య ప్రపంచానికి అందించిన గోండు ధీరుడు, విప్లవ యోధుడు ప్రజాకవి కామ్రెడ్ సాహు. ఉద్యమ జీవితంలో కేంద్ర కమిటీలో క్రీయశీలక పాత్ర పోషించాడు.
భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు (సాహు) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్‌కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్‌లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. పలు నిరసన కార్యక్రమాలు పాల్గొని తెలంగాణ అవసరంగా భావించి ప్రజలను చైతన్యవంతం చేశాడు. తెలంగాణ వస్తేనే ఈ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడ్తాయంటూ అనేక సమావేశాలు, సభల్లో పాల్గొని ప్రసంగించాడు.
ఉద్యమంలో...
హుజురాబాద్‌లో చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ విధంగా ఉద్యమానికి ఆకర్షితులైన సాహు జ మ్మికుంటలో డిగ్రీ చదువుకునే రోజు ల్లోనే ‘గ్రామాలకు తర లిరండి’ అనే కా ర్యక్రమాన్ని ఆయన స్వంత గ్రామామైన మాణిక్యాపూర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాణిక్యాపూర్‌తో పరిసర గ్రామాల ప్రజలతో పాటు మావోయిస్ట్ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు, నల్ల ఆదిరెడ్డితో పాటుగా అనేక మంది మావోయిస్టులు హాజరై విప్లవ ఆవశ్యకతను వివరించారు. అనంతరం సాహు ఆదిలాబాద్ అడవుల్లోకి పయనమయ్యాడు. అక్కడ గొండులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటాలు చేస్తూనే గొండు భాషను నేర్చుకొని వారిలో ఒకడిగా మారిపోయాడు. ఆ క్రమంలోనే అతని కలం పేరును సాహుగా పెట్టుకున్నాడు.
విప్లవ రచయితల సంఘం(విరసం)లో సభ్యుడిగా కొనసాగుతూనే గొండులపై అనేక కథలు, కవితలు, పాటలు రాశాడు. అతని పాటలు నేటికి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో గొండు ధీరుడు కొమురం భీం జీవిత చరిత్రను రాసాడు. అటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లిన సాహు ఆదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయిన సమయంలో పోలీసుల అడిగిన ప్రశ్నలకు గొండు భాషలోనే సమాధానం ఇవ్వడంతో పుట్టు గిరిజనుడనుకొని లాకప్పులో వేశారు. అనంతరం తెలిసింది అతనొక విప్లవోద్యమనాయకుడని. సాహు జైల్లో ఉన్న సమయంలో విప్లవోద్యమం రెండు వర్గాలుగా విడిపోయింది. కానీ ఏ వర్గం కూడా తనను జైలు నుంచి విడిపించేందుకు కృషి చేయలేదని సాహు తన స్నేహితుల వద్ద మధన పడేవాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఉద్యమంలో ఇమడలేక సాధారణ జీవితం గడపలేక తీవ్ర సంఘర్షణను ఎదుర్కొన్నాడు సాహు.
మళ్లీ కలం పట్టిన సాహు...
అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహు జైలు నుంచి విడుదలయ్యాక సాధారణ జీవితం గడపలేక తీవ్ర సంఘర్షణను ఎదుర్కొన్నాడు. తన కోసం తాను జీవించడం కాదు.. పేదల కోసం జీవించాలంటూ తిరిగి తన కలానికి పదును పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో బీఎస్ రాములు నేతృత్వంలో ఆవిర్భవించిన దరకమే (దళిత రచయిత కళాకారుల మేధావుల) ఐక్య వేదిక జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తిరిగి సాహిత్యంపై తన కలానికి పదును పెట్టాలనుకొని మాన్యం అడవుల్లో కిడ్నాప్ అయిన బాలరాజు ఉదాంతంపై నవల రాయాలనుకున్న సాహు అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు.
ప్రభుత్వం గుర్తించాలి..
మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందించడంతో పాటుగా తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గిరిజన అభివృద్ధికి ఆయన చేసిన రచనలను ప్రభుత్వం వెదికి ఆచరణలో పెట్టాలని ఆయన మిత్రులు కోరుతున్నారు.