
లాలాపేట : విజయ డెయిరీ లీటర్ పాల ధర రూ.47కి చేరింది. తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరి) ఈ రెండు నెలల కాలంలో లీటరు పాలపై రూ.5 పెంచింది. గత రెండు నెలల క్రితమే రూ.2 పెంచింది. తాజాగా మళ్లీ మరోసారి రూ.3 పెంచడంతో విజయ పాల వినియోగదారులు ఈ పెంపు ను భారంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకే విక్రయిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ పాల ధరను అధికంగా పెంచడంతో నాణ్యతకు పేరున్న విజయ పాలను కొనలేని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. దీనిపై విజయ డెయిరి మార్కెంటింగ్‌అధికారులను వివరణ కోరగా.. జనవరి 26న పాడి రైతులకు ప్రొక్యూర్‌మెంట్ కోసం రూ.2 పెంచామన్నారు. ఆ పెంపును భర్తీ చేయడానికే తాజాగా లీటరు పాల ధరను పెంచాల్సి వచ్చిందన్నారు. ఈ పెంపు ఈ నెల 16 నుంచే వర్తిస్తుందని తెలిపారు.