
విజయనిర్మల పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న నరేశ్
హైదరాబాద్: అశ్రునయనాల మధ్య సినీనటి, దర్శకురాలు విజయనిర్మల అంతిమయాత్ర నానక్‌రాంగూడలోని ఆమె నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. భర్త కృష్ణ, కుమారుడు నరేశ్, హీరో మహేష్‌బాబు.. విజయనిర్మల పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన ట్రక్‌పైకి తరలించారు. అనంతరం విజయనిర్మల అమర్‌రహే అన్న అభిమానుల నినాదాల నడుమ ఇంటి నుంచి ప్రత్యేక వాహనం ముందు సాగింది. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు, జూనియర్ ఆర్టిస్టులు విజయనిర్మలను కడసారిగా చూసి నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడలోని పోచమ్మ అమ్మవారంటే కృష్ణ, విజయనిర్మల దంపతులకు అత్యంత భక్తి. ఆ ఆలయం వద్దకు రాగానే అంతియ యాత్రను కొద్దిసేపు నిలిపారు. ప్రతియేటా బోనాల సమయంలో విజయనిర్మల తనవంతు సహకారం అందించేవారు. దీంతో గ్రామస్తుల తరఫున స్థానికులు ఆమె పార్థివదేహంపై శాలువా కప్పి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిలుకూరు వరకు యాత్ర సాగింది.
నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
నానక్‌రాంగూడలోని కృష్ణ, విజయనిర్మల నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9.34 గంటలకు చేరుకున్నారు. ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించి కృష్ణ, నరేశ్‌ను ఓదార్చారు. ఏపీ సీఎం వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు.
సినీనటుడు కృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
చిలుకూరులో అంత్యక్రియలు
మొయినాబాద్ (చేవెళ్ల): విజయనిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు నానక్‌రాంగూడ నుంచి మొదలైన అంతిమ యాత్ర మధ్యాహ్నం 12.50 గంటలకు చిలుకూరు వ్యవసాయక్షేత్రానికి చేరుకుంది. ఆమె కుమారుడు నరేశ్ ముందు నడిచి కర్మకాండలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం నరేశ్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు కొన్ని నిమిషాల ముందే కృష్ణ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పార్థివదేహాన్ని చితిపై పెట్టే ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.40 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిలుకూరు ఫాంహౌస్‌లో జరిగిన అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సినీ ప్రముఖులు కల్యాణ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment