శుభ్రంగా కనిపిస్తున్న జైనథ్‌లోని సుందరగిరి
సాక్షి, ఆదిలాబాద్: ‘ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం’ ద్వారా గ్రామాల్లో చేపట్టిన పనులు గడిచిన ఐదేళ్లలో కంటే ఇప్పుడు ఫర్వాలేదనిపిస్తోంది. పారిశుధ్యం.. పచ్చదనం.. మురికినీరు, పవర్‌వీక్ సమస్యలు కొంత మేరకు తొలగిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, సర్పంచ్, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు ప్రణాళికలో భాగస్వాములు కావడంతో గ్రామాలు కొంత ప్రగతి సాధించాయి. ప్రతీరోజు గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడ పరిశుభ్రత ఉంది.. ఎక్కడ పారిశుధ్యం చేపట్టాలి.. ఏ మురికి కాలువ పారుతుంది.. శ్రమదానం ఎక్కడెక్కడ చేపట్టాలి. ఎన్ని రోడ్లు బాగున్నాయి.. ఏ రోడ్డుకు మరమ్మతు చేయాలని స్పష్టంగా తెలుసుకొని పనులు చేపట్టడంతో పల్లెల్లోని సమస్యలు కొంత మేరకు దూరమయ్యాయి.
గత నెల 6న ప్రారంభమైన ‘30 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగి శనివారంతో ముగిసింది. దీని ద్వారా జిల్లాలోని 467 గ్రామ పంచాయతీలు 81 శాతం పరిశుభ్రతను సాధిస్తే.. 49 శాతం మేర నర్సరీలు, మొక్కలు నాటడం సాధ్యమైంది. ఇక పల్లెల్లో పవర్‌వీక్ సమస్యలు 40 శాతం వరకు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు చేయగా మిగిలిన పనులను ప్రణాళికలో భాగంగా రూపొందించిన ‘వార్షిక ప్రణాళిక’లో చేర్చి ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు 466 గ్రామ పంచాయతీల్లో 1,398 మంది కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. 28,045 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఇందులో 13,214 మంది మహిళా సభ్యులు ఉన్నారు.
ఫర్వాలేదనిపించిన పారిశుధ్య పనులు
ప్రణాళిక కార్యక్రమం గ్రామాల్లోని చాలా సమస్యలను దూరం చేసింది. పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లోని సీసీ రోడ్లపై గుంతలు, మురికి కాలువల్లో పూడికతీత, బుదరమయంగా ఉన్న రోడ్లపై మోరం వేసి మరమ్మతు చేపట్టారు. సమస్య గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో జిల్లాలో శానిటేషన్ పనులు 81 శాతం పూర్తయ్యాయి. ఇందులో భాగంగా గడ్డి, ముళ్ల పొదలు తొలగించడం, పాడుబడిన, ఓపెన్ బోరు బావులను పూడ్చడం, శిథిలాలను కూల్చివేయడం, లోతట్టు ప్రాంతాలను గుర్తించి సరిసమానం చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడం, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్ స్థలాలు శుభ్రపర్చడం లాంటి పనులు చేశారు.
దీంతో పాటు పారిశుధ్య పనుల్లో భాగంగా ఇంటికో చెత్త బుట్టను పంపిణీ చేపట్టారు. నెల రోజుల పాటు గ్రామాల్లో తిరిగినా అధికారులు 1,04,580 నివాస గృహాల్లో చెత్త బుట్టలు లేవని గుర్తించి ఇప్పటి వరకు 31,633 గృహాలకు బుట్టలను అందజేశారు. ఇంటిని శుభ్రం చేయగా వచ్చిన చెత్తను ఈ బుట్టలో వేసుకొని ఉంచాలి. పారిశుధ్య కార్మికులు వచ్చినప్పుడు ఆ చెత్తను వారికి అప్పగించాలి. కాని ఈ బుట్టలను కొంత మంది ఇంటి అవసరాల కోసం వాడే నీటికి ఉపయోగించడం గమనార్హం.
వెనుకబడిన విద్యుత్ సమస్యల పరిష్కారం
గ్రామాల్లోని ప్రతీ వార్డుల్లో ఉన్న విద్యుత్ సమస్య ప్రణాళికతో బయటపడింది. జిల్లాలోని 17 గ్రామీణ మండలాల్లో మొత్తం విద్యుత్ సమస్యలు 45,547 ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ వరకు 18,342 సమస్యలు మాత్రమే పరిష్కరించి 40 శాతం లక్ష్యం సాధించారు. మిగతా 27,205 సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అయితే ఈ సమస్యలు పరిష్కరించేందుకు కావాల్సిన బడ్జెట్ పంచాయతీ కార్యాలయం నుంచి చెల్లిస్తారా..? లేక ప్రభుత్వం చెల్లిస్తుందా.? అనేదానిపై అధికారులు లెక్కేసేకుంటున్నారు.
ఒక వేళ పంచాయతే చెల్లిస్తే.. గుర్తించిన సమస్యలకు సరిపడా బడ్జెట్ ఉందా? లేదా? అనే దానిపై సమాలోచన చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఇప్పటి వరకు ఉన్న స్తంభాలను సరిచేయడం, వీధిలైట్లను అమర్చడం, వేలాడుతున్న వైర్లను గుర్తించడం లాంటి పనులు చేపట్టారు.
జిల్లాలో 375 శ్మశాన వాటికలు.. 390 యార్డులు అవసరం
జిల్లాలో ప్రస్తుతం 92 గ్రామాల్లో వైకుంఠ ధామాలు ఉన్నాయి. ఇంకా 375 అవసరం. ప్రణాళిక ద్వారా 338 వైకుంఠ ధామాలు కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తించారు. మిగతా 37 చోట్ల స్థలాలను గుర్తించలేదు. కాగా, జిల్లాలో ప్రస్తుతం 37 డంపింగ్ యార్డులు ఉన్నాయి. ఇంకా 390 యార్డులు అవసరం. అయితే నెల రోజుల్లో 355 యార్డులు కొత్తగా నిర్మించాలని, మిగతా 35 చోట్ల ఏర్పాటుకు అవకాశం ఉందని అధికారులు గుర్తించాల్సి ఉంది.
కొంత వరకు నయమే..
గ్రామాల్లో గత ఐదేళ్లుగా జరిగిన పనుల కంటే ఈ నెలలో జరిగిన పనులు కొంత నయమనిపిస్తోంది. ఎప్పుడో ఓసారి నాళీలను శుభ్రం చేసేవారు. కానీ ఇప్పుడు మురికికాలువలు, బురద, గుంతలు లేని రోడ్లు, మోరం వేసిన రోడ్లు కన్పిస్తున్నాయి. ఊరికి పక్కన ఉన్న పెంటకుప్పలతో ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్య ఇప్పుడు లేదు.
– కుమ్మరి కల్యాణ్‌కుమార్, తాంసి(బి)
ప్రణాళికతో ప్రగతి
గత నెలలో ప్రారంభమైన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంతో పల్లెల్లో ప్రగతి కని పిస్తోంది. జిల్లాలో ని అన్ని పంచాయతీలు పారిశుధ్యం, పరిశుభ్రతతో కనిపిస్తున్నా యి. వీటితో పాటు గ్రామాల్లోని చాలా స మస్యలు దూరమయ్యాయి. ప్రభుత్వం ప ల్లెలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైంది. ఈ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర పరిశీలన బృందాలు జిల్లాకు రానున్నాయి.
– సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment