ఆనవాళ్ల కోసం పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని పువ్వాడనగర్‌లో చిరుతపులి సంచరించిందని కలకలం నెలకొంది. గుట్టపక్కనే అనుకొని ఉన్న నివాసాల వద్దకు గురువారం అర్ధరాత్రి చిరుతపులి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకుని శుక్రవారం అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అటవీశాఖ రేంజ్ అధికారి రాధిక, డిప్యూటీ రేంజ్ అధికారి రేణుక, ఎఫ్‌ఆర్‌ఓ దుగ్గిరాల శ్రీను, రవి, తహసీల్దార్ శ్రీనివాసరావు, పంచాయతీ ప్రత్యేక అధికారి జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అడుగు జాడలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొంతమంది తోడేలని, మరికొంతమంది పునుగు పిల్లి అని, ఇంకొంతమంది చిరుత జాడలేనని చెబుతున్నారు. అడుగు ముద్రలు, బిత్తర చూపులు చూస్తున్నట్లు కనిపించిందని కొందరు చెప్పిన మాటల ఆధారంగా పునుగు పిల్లిగా భావిస్తున్నట్లు డిప్యూటీ రేంజర్ రేణుక చెబుతున్నారు. ఇక్కడి ఆధారలను బట్టి పూర్తిగా నిర్ధారణ చేసుకోలేమని అన్నారు. ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను అమర్చి..ఆ తర్వాత అది ఏ జంతువో తేలుస్తామని ప్రకటించారు. గ్రామంలో చిరుత సంచరించినట్లు సమాచారం అందడంతో పువ్వాడనగర్ వాసులు బెంబేలెత్తారు. పెద్ద ఎత్తున జనం వచ్చి కాలనీని పరిశీలించి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment