పాల్వంచ : జిల్లాలో విషజ్వారాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. ఒక్క మంగళవారం రోజునే జ్వరాల తో పాల్వంచ మండలంలో ముగ్గురు, చండ్రుగొండ మండలంలో ఒకరు మృత్యువాత పడ్డారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లపైనే మురుగు నీరు చేరుతుండడంతో దోమలు ప్రబలుతున్నాయని, పారిశుధ్య సమస్యను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జర పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా వైద్య సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించాల్సిన వైద్య సిబ్బంది కనిపించడమే లేదని చెపుతున్నారు.
పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ కొత్తూరు బంజర గ్రామానికి చెందిన కుంజా మల్లయ్య, లక్ష్మి దంపతుల కూతురు అనిత(14) ఉల్వనూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వచ్చిన అనిత మూడు రోజుల క్రితం జ్వరం బారిన పడింది. దీంతో ఉల్వనూరు పీహెచ్‌సీలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో పాల్వంచ, ఖమ్మంలోని ఆస్పత్రుల్లో చూపించారు. బాలిక సెలబ్రల్ బ్రెయిన్ మలేరియాతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు.
చివరకు కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఇక పాల్వంచ మున్సిపాలిటీలోని హమాలీ కాలనీకి చెందిన మిటా రాజక్క (40) పది రోజులుగా జ్వరంతో భాదపడుతూ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అలాగే పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన జర్పల శేఖర్, స్వర్ణ దంపతుల కూతురు నిత్య(4 నెలలు) నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చికిత్స పొందుతూనే మృత్యువాత పడింది. ఈ విషయకమై ఉల్వనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాఘవేందర్ రెడ్డిని వివరణ కోరగా.. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, వాతావరణంలో మార్పులు, దోమల కారణంగా గత రెండు రోజులుగా జ్వారపీడితుల సంఖ్య పెరిగిందని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
చండ్రుగొండలో..
చండ్రుగొండ మండలం తిప్పనపల్లి డీవీనగర్‌కు చెందిన పూజల వెంకటేశ్వర్లు (40) విషజ్వరంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా ఆస్పత్రికి తీసుకెళ్లామని, అయినా పరిస్థితి అదుపులోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తిప్పనపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరాలు ప్రబలి సుమారు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు వెంకటేశ్వర్లు మరణంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విజృంభిస్తున్న విషజ్వరాలు
Published Wed, Aug 27 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement