మేమింతే.. ఎంత ప్రచారం చేసినా పోలింగ్‌ అంతంతే | Voting Percent Down fall in hyderabad | Sakshi
Sakshi News home page

మేమింతే.. ఎంత ప్రచారం చేసినా పోలింగ్‌ అంతంతే

Published Sat, Dec 8 2018 10:12 AM | Last Updated on Thu, Jan 3 2019 12:17 PM

Voting Percent Down fall in hyderabad - Sakshi

ఫరూక్‌నగర్‌లో...

సాక్షి, సిటీబ్యూరో :గ్రేటర్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణ కోసం రెండు నెలల ముందు నుంచే పోలీసులు అమలు చేసిన వ్యూహం ఫలించింది. శుక్రవారం ఎలాంటి చిన్న సంఘటన లేకుండా  ఎన్నికలు ముగిశాయి. మరోపక్క మహానగరంలో పోలింగ్‌ శాతం గత ఎన్నికల కంటే తగ్గిపోయింది. ఓటు హక్కు ప్రాముఖ్యం గురించి ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేసినా ఓటర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. వరుస సెలవులు రావడంతో పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆన్‌లైన్‌ సదుపాయంతో పాటు జాబితాలో పేరు నమోదు చేయించుకునేందుకు ఎన్నో పర్యాయాలు గడువు పెంచినా, పేరు నమోదు చేయించుకోవడంపై చూపిన శ్రద్ధ పోలింగ్‌లో చూపించలేదు. పాతబస్తీలోని పోలింగ్‌పై ‘శుక్రవారం’ ప్రభావం పడింది. ప్రార్థనల నేపథ్యంలో ఇక్కడా తక్కువ శాతమే నమోదైంది. మరోపక్క పలు నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేసేందుకు వచ్చిన వారు జాబితాలో పేరు లేదని తెలిసి ఆగ్రహంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘పోయినసారి ఎన్నికల్లో ఓటు వేశాం.. మరి ఇప్పుడెందుకు పేరు తొలగించార’ని నిలదీశారు. కొన్నిచోట్ల కుటుంబంలో ఒకరి పేరుంటే మరొకరి పేరు కనిపించలేదు. సాధారణ ఓటర్లతో పాటు పలువురు సెలబ్రిటీల ఓట్లు కూడా గల్లంతవడం గమనార్హం. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. 

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే శుక్రవారం సాయంత్రం ఆయా పార్టీలు గెలుపు తమదంటే..తమదేనని ప్రకటించాయి. పోలింగ్‌ శాతం, ఓటింగ్‌ సరళి మేరకు బూత్‌ల వారీగా ఓట్లను అంచనా వేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, 2014తో పోలిస్తే నగరంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం తగ్గిపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేకూరుతుందన్న అంశం చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, ముషీరాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలపై పూర్తి ధీమాతో ఉంది. కాంగ్రెస్‌ కూటమి ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, మేడ్చల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, కంటోన్మెంట్, ముషీరాబాద్‌ స్థానాలపై నమ్మకం పెట్టుకుంది. బీజేపీ అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, మల్కాజిగిరి స్థానాల్లో తప్పక గెలుస్తామని లెక్కలు వేస్తోంది. బీజేపీకి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఇక ఎంఐఎం పాతబస్తీలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నా, నాంపల్లి, మలక్‌పేటలో తీవ్రమైన పోటీ తప్పలేదు. ఈసారి తమకు రాజేంద్రనగర్‌ బోనస్‌గా వస్తుందని భావిస్తున్నా, నాంపల్లి, మలక్‌పేటలో ఏమవుతుందోనన్న ఆందోళన కూడా ఆ పార్టీలో ఉంది.  

పోలింగ్‌ శాతం హైదరాబాద్‌ జిల్లా48.96 శాతం
రంగారెడ్డి జిల్లా (గ్రేటర్‌  పరిధి) 50.81 శాతం
మేడ్చల్‌ జిల్లా 55.75 శాతం
గోషామహల్‌లో అత్యధికం 58.59 శాతం 
మలక్‌పేట్‌లో అత్యల్పం 40 శాతం 
కూకట్‌పల్లి భరత్‌నగర్‌ 159 బూత్‌లో100 శాతం

ఈసీ తుది ప్రకటన మేరకు పోలింగ్‌ ఇలా..
హైదరాబాద్‌ జిల్లా   నియోజకవర్గం    శాతం

నాంపల్లి              44.14
యాకుత్‌పురా    41.75
చార్మినార్‌          48.94
చాంద్రాయణగుట్ట   47.81
కంటోన్మెంట్‌        49.01
బçహదూర్‌పురా  50.49
గోషామహల్‌    58.59
కార్వాన్‌         51.37
ముషీరాబాద్‌  47.62
సనత్‌నగర్‌    52.18
ఖైరతాబాద్‌    50.54    
జూబ్లిహిల్స్‌    45.47
అంబర్‌పేట్‌    52.85
మలక్‌పేట్‌    40.00
సికింద్రాబాద్‌  53.60
మొత్తం       48.96

మేడ్చల్‌ జిల్లా నియోజకవర్గం    శాతం
ఉప్పల్‌        51.04
మల్కాజిగిరి    51.68
కుత్బుల్లాపూర్‌ 55.77   
కూకట్‌పల్లి    57.72
మేడ్చల్‌       62.56
మొత్తం       55.75

రంగారెడ్డి జిల్లా
నియోజకవర్గం    శాతం
శేరిలింగంపల్లి    48.00
ఎల్బీనగర్‌      42.00
మహేశ్వరం    48.05
రాజేంద్రనగర్‌    53.50
ఇబ్రహీంపట్నం  62.51
మొత్తం          50.81

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement