హైదరాబాద్: మెట్రో నగరాల్లో ఓటరు చైతన్యం కొడిగడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారు కనీసం తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కూడా బద్దకిస్తున్నారు. నెట్స్‌అవే సంస్థ ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సేకరించింది. ఆ వివరాల్లోకెళ్తే..
53 శాతమే అత్యధికం..
ఓటు చైతన్యంలో బెంగళూరు ముందంజలో నిలిచింది. ఈ సిటీలో ఓటరు నమోదు, ఐడీ కార్డులను పొందడంతోపాటు క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నవారు 53 శాతం మంది ఉన్నారట. మిగతా నగరాలతో పోలిస్తే ఇదే అత్యధికం కావ డం విశేషం. ముంబై, పుణే నగరాలు 52 శాతం ఓటరు చైతన్యంతో రెండోస్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 47 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ రాజధా ని హైదరాబాద్ ఈ విషయంలో మరింత వెనుకబడింది. ఇక్కడ కేవలం 45 శాతం మంది మాత్రమే ఓటుపై ఆసక్తి కనబరుస్తున్నారు.
కారణాలివే..
- నగరాల్లో స్థిరపడుతున్నవారంతా వలస వచ్చినవారే కావడంతో ఓటు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
- యువతలో 75 శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహనే లేదు.
- పట్టణాల్లో స్థిరపడినా పుట్టిన గ్రామాల్లోనే ఓటు వేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపడం.
- ఇక 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని విశ్వసిస్తున్నారు.
ఈసారి తప్పకుండా వేస్తాం..
కనీసం ఈసారైనా ఓటు వేస్తారా? త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారా? అని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నలకు 75 శాతం మంది ‘ఈసారి తప్పకుండా వేస్తామ’ని చెప్పారు. మరో 20 శాతం మంది మాత్రం వేయాలనే ఉన్నా కుదరదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఐదు శాతం మంది మాత్రం తాము ఓటు వేయబోమని కచ్చితంగా తేల్చేశారు. వేసినా పెద్దగా మారేదేమీ లేనప్పుడు ఎందుకు వేయాలంటూ ఎదురు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment