జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్‌ఓ)ల బదిలీలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.ఏడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారంతా బదిలీలకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో లేని విధంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుత బదిలీల్లో సొంత మండలాలను, ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలని నిర్ణయించింది.
చౌటుప్పల్ : జిల్లాలో 830వీఆర్వో పోస్టులుండగా 733మంది పనిచేస్తున్నారు. మొత్తం 97పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008లో బదిలీ అయిన వారు ఇప్పటి వరకు ఏడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 231మంది ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వీరందరినీ బదిలీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఏడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్‌ఓల జాబితాను, ఖాళీగా ఉన్న జాబితాను విడుదల చేసింది. వీరంతా ఈ నెల 10వ తేదీలోగా బదిలీకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 7ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఆలేరు నియోజకవర్గంలో 23మంది, భువనగిరి-19, మునుగోడు-19, దేవరకొండ-14, తుంగతుర్తి-31, సూర్యాపేట-24, నకిరేకల్-32, కోదాడ-11, మిర్యాలగూడ-7, హుజూర్‌నగర్-11, నల్లగొండ-14, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 26మంది ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది.
సొంత మండలానికి బదిలీ ఉండదు..
చాలా మండలాల్లో వీఆర్‌ఏలుగా పనిచేసి, వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతి పొంది, సొంత మండలాల్లోనే పనిచేస్తున్నారు. కొంత మంది వీఆర్‌ఓలు కూడా తమ సొంత మండలాల్లోనే తిష్ట వేశారు. వీరికి ఉద్యోగిగా సరైన గౌరవం దక్కకపోవడంతో పాటు, పాత రికార్డుల మార్పిడి, రాజకీయ సంబంధాలతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మా రారు. దీంతో సొంత మండలాల నుంచి పంపించాలని, బదిలీల్లోనూ సొంత మండలాలకు బదిలీ చేయొద్దని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలనే ఆలోచనకు వచ్చారంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు.
మూడేళ్లు దాటితే రిక్వెస్ట్ బదిలీ..
ఒకే క్లస్టర్‌లో ఏడేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలనుకుంటున్న జిల్లా యంత్రాంగం, మూడేళ్లు దాటిన వారు కూడా బదిలీ కోరితే చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అందుకు కలెక్టర్ ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆలేరు నియోజకవర్గంలో 9, భువనగిరి-6, మునుగోడు-8, దేవరకొండ-14, తుంగతుర్తి-4, సూర్యాపేట-5, నకిరేకల్-9, కోదాడ-13, మిర్యాలగూడ-4, హుజూర్‌నగర్-16, నల్లగొండ-4, సాగర్ నియోజకవర్గంలో 11చొప్పున వీఆర్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వీఆర్‌ఓల బదిలీలు షురూ..!
Published Fri, Jul 3 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement