వీఆర్‌ఓ వెంకటయ్యను అదుపులోకి తీసుకుంటున్న ఏసీబీ అధికారులు
అచ్చంపేట రూరల్ : రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఎక్కడో ఒక దగ్గర ఆ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉప్పునుంతల మండలం ఫిరట్వానిపల్లికి చెందిన వీఆర్‌ఓ వెంకటయ్య రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని చెట్ల కింద పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన వెంకటసాయి కిరణ్ ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామ సమీపంలో ఉన్న గుట్ట సర్వే నంబర్ 61లో గాజు పెంకులు తీసుకోవడానికి 2018 ఆగస్టు 1న మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆగస్టు 3న సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు ఉప్పునుంతల మండల తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సర్వే నంబర్ 61లో పూర్తి వివరాలను సేకరించి దరఖాస్తుదారుడికి కావాల్సిన పత్రాలను ఇవ్వాలని సూచించారు.
రూ.30 వేలు డిమాండ్
విచారణ చేసిన అనంతరం తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆగస్టు 14న ఎన్‌ఓసీ, స్కెచ్ ఇచ్చారు. కాగా ఏ1 సర్టిఫికెట్ మాత్రం వీఆర్‌ఓ వెంకటయ్య దగ్గర ఉండిపోయింది. విచారణ చేసి ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్ పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని వెంకటసాయి కిరణ్ వీఆర్‌ఓ వెంకటయ్యను పదే పదే అడిగినా అలసత్వం చేసి రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటసాయి కిరణ్ ఈ నెల 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
వారి సూచన మేరకు అదే రోజు వెంకటసాయి కిరణ్ వీఆర్‌ఓతో మాట్లాడి రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిర్చాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కింద వెంకటసాయి కిరణ్ వీఆర్‌ఓ వెంకటయ్యకు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్నట్లు వేలిముద్రల ద్వారా నిర్ధారణ అయ్యిందని, పూర్తి విచారణ చేసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో వీఆర్‌ఓ వెంకటయ్యను హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. రెవెన్యూ శాఖలో, ఎవరైనా అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు. వీఆర్‌ఓ వెంకటయ్యను వలవేసి పట్టుకున్న ఏసీబీ సిబ్బందిలో ఎస్‌ఐ లింగస్వామి, కమల్‌కుమార్, అష్రప్, కృష్ణ, రవి, ఆంజనేయులు ఉన్నారు.
అప్పుడూ అదే స్థలంలో..
బల్మూర్ మండల కేంద్రంలో వీఆర్‌ఓగా విధులు నిర్వర్తించిన వీఆర్‌ఓ వెంకటయ్య 2014 జనవరి 7న భూమి విరాసత్ విషయంలో రూ.4 వేలు లం చం తీసుకుంటూ పట్టుబడ్డారు. విషయమేమంటే మొదటిసారి కూడా అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. గురువారం కూడా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రస్తుతం వీఆర్‌ఓ వెంకటయ్య వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment