సర్వేయర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
సాక్షి, అలంపూర్: లంచం తీసుకుంటుండగా సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉండవల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు... మండలంలోని కంచుపాడుకు చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి, సత్యారెడ్డి అన్నదమ్ములు. వారికి 7.12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో పెద్ద వెంకట్ రెడ్డికి 2.18 ఎకరాలు, చిన్న వెంకట్ రెడ్డికి 2.17 ఎకరాలు, సత్యారెడ్డికి 2.17 ఎకరాలు ఆస్తి సంక్రమించింది.
తనçపొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని సత్యారెడ్డి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ సూచన మేరకు గతనెల 18న మీసేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈవిషయాన్ని సర్వేయర్ హరికృష్ణకు తెలిపాడు. దీంతో అక్టోబర్ 2న హరికృష్ణ సర్వే పనులు పూర్తి చేశాడు. రిపోర్టు ఇవ్వలేదు. కొన్నిరోజులు తిప్పుకుని రూ.7వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సత్యారెడ్డి అభ్యర్థన మేరకు రూ.5వేలకు రిపోర్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయమై సత్యారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు.
అయితే సర్వేయర్ ముందుగా లంచం డబ్బులు కర్నూలులోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించాడు. చివరకు కార్యాలయం వద్దకే తేవాలని చెప్పాడు. చివరికి సర్వేయర్ సూచన మేరకు ఆయన కారులో డబ్బును ఉంచాడు. ఏసీబీ అధికారులు కారును సోదా చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కర్నూలోని ఆయన నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, కమల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment