మళ్లీ చిరుతల సంచారం!
- జోరుగా ప్రచారం భయం గుప్పిట్లో గ్రామాలు
- వ్యవసాయ పొలాల్లో సంచరిస్తున్నట్టు ధ్రువీకరణ
- ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు
కొల్చారం : చిరుత పులులు మళ్లీ సంచరిస్తున్నట్టు ప్రచారం జరగడంతో జనం బెంబేలు చెందుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందోననే భయం వారిలో నెలకొంది. ఈ నెల ఒకటిన మండలంలోని తుక్కాపూర్‌లో చిరుత కలకలం రేపి తొమ్మిది మందిని గాయపర్చిన ఘటన తెల్సిందే. చిరుతపులిని బంధించేందుకు అటవీ అధికారులు, ప్రజలు సుమారు ఆరున్నర గంటలపాటు శ్రమించి వలలో బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరిగి పక్షం రోజులు కావడం మరోమారు మండలంలో చిరుతపులులు సంచరిస్తున్నాయన్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొల్చారం మండలంలోని మంజీర పరీవాహక గ్రామాలైన కోనాపూర్, పైతర గ్రామ శివారులలో రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని ప్రత్య క్ష సాక్షులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో కోనాపూర్‌కు చెందిన వెంకటేశ్వరరావు పొద్దుతిరుగుడు పంటలో రెండు పులులు సంచరించినట్లు తెలిపాడు. అదే రోజు సాయంత్రం 6:30గంటల సమయంలో గ్రామ సమీపంలోని మంజీర వాగు వద్ద లక్ష్మణ్‌రావుకు చిరుతపులి కంటపడినట్లు గ్రామస్థులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు చిరుత పులుల సమాచారాన్ని స్థానిక తహశీల్దార్, ఎస్‌ఐలకు తెలియజేశారు. రాత్రి పొద్దుపోయాక సమాచారం బయటకు రావడంతో సోమవారం ఉదయం మెదక్ అటవీశాఖకు చెందిన అధికారులు రేంజ్ అధికారి శ్యామ్‌రావు, సెక్షన్ అధికారి శాంతన్‌గౌడ్‌లు కోనాపూర్ గ్రామాన్ని సందర్శించి చిరుతపులి కనిపించిన ప్రదేశాలను పరిశీలించారు. రేంజ్ అధికారి శ్యామ్‌రావు మాట్లాడుతూ చిరుతపులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించామని వాటి అడుగులు కనిపించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.