చిరుతపులుల సఫారీతో ఖండాంతర ఖ్యాతి
పర్యావరణ ప్రేమికులను కట్టిపడేసే ప్రకృతి అందాలు
రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో 2014లో ఏర్పాటు
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుజన్ జవాయీ.. రాజస్థాన్‌లోని జవాయీ అరణ్యంలో కేవలం పది విలాసవంతమైన గుడారాలు, ఒక రాయల్ టెంటెడ్ సూట్‌లో ఏర్పాటుచేసిన సఫారీ క్యాంప్. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు, అద్భుతమైన ప్రకృతి అందాల కారణంగా ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్‌లో ఇది ఒకటిగా స్థానం సంపాదించింది. జైసల్, అంజలీసింగ్ అనేవారు 2014లో పాలీ జిల్లాలో ఈ జంగిల్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో చిరుతపులులు సంచరించే సుందరమైన గడ్డి మైదానాలు, పచ్చదనం పులుముకున్న పర్వత శ్రేణులు, జవాయీ నది మధ్యలో ఇసుక తిన్నెలు కవర్ చేసేలా ఈ క్యాంపును డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో 60 వరకు చిరుతలు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల ఊసే లేని ఈ ప్రాంతంలో స్థానికులు చిరుతలతో జీవిస్తుంటారు.
ఇక్కడ టెంట్ బయట కూర్చొని అధ్బుతమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. అడవుల్లో చేసే సాహసాలు, చిరు™è ల ట్రాకింగ్, పొదల్లో బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట ఆరుబయట డిన్నర్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఆధునిక కాలంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి సుజన్ జవాయీ క్యాంప్ ఒక మంచి అవకాశం. టూర్‌లో భాగంగా సమీపంలోని గ్రామాలకూ తీసుకువెళ్లి అక్కడి గ్రామీణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, పరిశీలించే అవకాశం కూడా కలి్పస్తారు. చిరుతలను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఉదయం, సాయంత్రం సఫారీ ఉంటుంది. కొండపైన టెంట్ ముందు కూర్చొని జువాయీ సరస్సు అందాలు, చుట్టుపక్కల పొలాలను సాగుచేసుకునే రైతులను చూస్తూ సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు.
పెరగనున్న విదేశీ పర్యాటకులు
ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో సుజన్ జవాయీకి స్థానం లభించడంతో మరింత పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిస్ట్ డెస్టినీగా ఉన్న రాజస్థాన్‌కు ఇది మరింత ఊపు తీసుకువస్తుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా దేశ పర్యాటక రంగానికి ఆదాయం పెరుగుతుంది.
ఎలా చేరుకోవచ్చు?
⇒ ఈ క్యాంప్ ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 150 కిలోమీటర్లు, జోద్‌పూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
⇒ మోరీ బెరా రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అనుకూల సమయం
⇒ అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య సందర్శనకు అత్యంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి ఉష్ణోగ్రతలు 10 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.
⇒ విడిది చేయాల్సిన సమయం: ఇక్కడి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం రెండు రాత్రులు, 3 పగళ్లు విడిది చేయాల్సి
ఉంటుంది.
50 అత్యుత్తమ హోటల్స్‌లో స్థానం
ప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాల్లో అత్యుత్తమ వసతులు కలిగిన 50 హోటల్స్‌లో సుజన్ జవాయీ హోటల్ స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్ జాబితాను ‘50 బెస్’ అనే సంస్థ ఇటీవల లండన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో సుజన్ జవాయీ 43వ స్థానం సంపాదించింది. ట్రావెల్ జర్నలిస్ట్‌లు, ఆతిథ్యరంగ ప్రముఖులు, ట్రావెల్ స్పెషలిస్ట్‌లతో కూడిన 600 మంది గ్లోబల్ ఓటర్లు ఈ జాబితాను సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో థాయిలాండ్‌లోని చావో ఫ్రయా నదికి ఎదురుగా ఉన్న కాపెల్లా బ్యాంకాక్ అనే విలాసవంతమైన హోటల్ ప్రపంచంలో బెస్ట్ హోటల్‌గా నిలిచింది. ఇటలీలో లేక్ కోమోలోని 18 శతాబ్ధానికి చెందిన విల్లా పసలాక్వా రెండో స్థానంలో నిలిచింది. హాంకాంగ్‌కు చెందిన విలాసవంతమైన హోటల్ రోజ్‌వుడ్ హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment